రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ప్రాంతం శనివారం రాత్రి కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన బీఎమ్‌ఆర్ ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మీడియాకు వివరించారు.
ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో శనివారం రాత్రి 9:30 గంటలకు ఈగల్ టీమ్, ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు భయాందోళనతో గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీ రితేష్ రెడ్డికి చెందినదిగా ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, రమేశ్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి, ఒక మహిళ ఉన్నారు. వీరంతా వీకెండ్ పార్టీ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం.
పోలీసులు ఘటనా స్థలంలోనే డ్రగ్ టెస్ట్ కిట్‌లతో పరీక్షలు నిర్వహించగా.. రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్‌గా తేలింది. తామంతా వారం క్రితమే సిమ్లా, గోవా పర్యటనల నుంచి వచ్చామని, అక్కడే డ్రగ్స్ తీసుకున్నామని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. అయితే పూర్తిస్థాయి నిర్ధారణ కోసం వీరి రక్త నమూనాలను సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) ల్యాబ్‌కు పంపినట్లు డీసీపీ తెలిపారు. సోదాల సమయంలో పోలీసులు సుమారు 2 గ్రాముల తెల్లటి పౌడర్‌ను (కోకైన్‌గా అనుమానం) స్వాధీనం చేసుకున్నారు. ఇది డ్రగ్సా కాదా అన్నది పరీక్షల తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు… ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా ఆరుగురికి పాజిటివ్

మొయినాబాద్ లోని అజీజ్ నగర్ ఫామ్‌హౌస్ పై జరిగిన ‘ఈగల్’ బృందం దాడుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ ధృవీకరించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ ఒక మహిళ సహా మొత్తం 11 మంది ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌కు తొలుత నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చినప్పటికీ, తదుపరి రక్త పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని ఎస్పీ చెప్పారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ వినియోగించినట్లు శాస్త్రీయ ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.
డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ… టీడీపీపై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పట్టుబడటం సిగ్గుచేటని విమర్శించారు. అతడిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా షర్మిల సోషల్ మీడియాలో స్పందిస్తూ… “ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఇక్కడ ఎంపీ కొకైన్‌తో విందు, చిందులు చేయడం దారుణం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా? డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువతను డ్రగ్స్ వాడమని ప్రోత్సహిస్తున్నారా? అని షర్మిల నిలదీశారు.
ఓట్లు వేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్‌పై నిజంగానే కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనుకుంటే, ముందుగా తమ సొంత పార్టీ ఎంపీపై చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని షర్మిల సవాల్ విసిరారు.
డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన పుట్టా మహేశ్‌కు ఎంపీగా ఉండే అర్హత లేదు: కాకాణి గోవర్దన్ రెడ్డి

డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. పుట్టా మహేశ్‌ను రక్షించడానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగారని, డ్రగ్స్ మాఫియాను ఆయనే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. సామాన్యుడికి ఒక రూల్, ప్రజాప్రతినిధికి మరో రూల్ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగిల్ ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.
ఈ నేపథ్యంలో కాకాణి మాట్లాడుతూ, “చంద్రబాబు బ్రాండ్ అంటేనే డ్రగ్స్ బ్రాండ్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో వైసీపీ నేతలు టీడీపీని ‘డ్రగ్స్ పార్టీ’గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇదే ఫామ్‌హౌస్‌లో కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పుట్టా మహేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
డ్రగ్స్ కేసు… ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. సోమవారం (మార్చి 16) పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలేసినట్టు తెలిసింది.
ఎంపీ మహేశ్ యాదవ్‌తో పాటు మరో నిందితురాలైన ప్రియాంక రెడ్డికి కూడా స్టేషన్ బెయిల్ లభించినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తును ఈగల్ టీమ్ వేగవంతం చేసింది. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారి నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేశ్ సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై చంద్రబాబు సీరియస్… నోటీసులు ఇవ్వాలని పల్లాకు ఆదేశం!

మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఆయన, పార్టీ కార్యకలాపాలకు తక్షణమే దూరంగా ఉండాలని పుట్టా మహేశ్‌ను ఆదేశించారు.
ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు.. పుట్టా మహేశ్ నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే, డ్రగ్స్ కేసులో పుట్టా పట్టుబడిన వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కూడా పల్లాను ఆదేశించారు.
వ్యక్తుల బలహీనతలు, వ్యక్తిగత తప్పిదాల వల్ల పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. డ్రగ్స్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే, ఉపేక్షించే ప్రసక్తే లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన ఉద్ఘాటించారు. ఈ ఘటనపై పార్టీపరంగా కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలను ఇచ్చారు.
ఆస్తుల కోసం కేసీఆర్ కుటుంబంలో ఫైట్ : మంత్రి కోమటిరెడ్డి