- లైంగికదాడి, హత్య వంటి క్రూరమైన నేరాలకు కాలపరిమితితో పరిష్కరించేలా నిబంధన తీసుకురావాలన్న మమత
- దీనినే పునరుద్ఘాటిస్తూ రెండో లేఖ రాసిన మమత
- మమత లేఖ ‘వాస్తవంగా తప్పు’ అంటూ బదులిచ్చిన కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత కేంద్రం, మమతా బెనర్జీ మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు లేఖల యుద్ధంగా మారింది. అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని కోరుతూ గతంలో కేంద్రానికి లేఖ రాసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న మరో లేఖ రాస్తూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
మమత రెండో లేఖపై కేంద్రం వెంటనే స్పందించింది. ఇలాంటి నేరాల అణచివేతకు ఇప్పటికే కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర మహిళా శిశు అభివృద్దిశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి.. మమత లేఖకు రిప్లై ఇచ్చారు. అంతేకాదు, తమకు లేఖలు రాయడం మాని ఆ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంపై దృష్టి సారించాలని కోరారు.
మమత తన లేఖలో పేర్కొన్న సమాచారాన్ని ‘వాస్తవంగా తప్పు’ అని అన్నపూర్ణాదేవి ఎత్తి చూపారు. రాష్ట్రంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (ఎఫ్‌టీఎస్‌సీఎస్) నిర్వహణలో జాప్యాన్ని కప్పిపుచ్చేందుకే ఆమె ఇలా లేఖల మీద లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. లైంగికదాడులు, పోక్సో కేసుల పరిష్కారానికి అదనంగా ఏర్పాటు చేసిన 11 ఎఫ్‌టీఎస్‌సీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో 48,600 లైంగిక దాడి, పోక్సో కేసులు పెడింగ్‌లో ఉన్నట్టు అన్నపూర్ణాదేవి తన లేఖలో పేర్కొన్నారు.
కోల్‌కతా ఘటన తర్వాత ప్రధాని మోదీకి మమత తొలిసారి లేఖ రాస్తూ ఇలాంటి కేసులను కాలపరిమితితో పరిష్కరించేలా తప్పనిసరి నిబంధన తీసుకురావాలని కోరారు. తాజాగా, రెండో లేఖలో దీనిని పునరుద్ఘాటించారు.