- తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లకుండానే పలు ధ్రువపత్రాల జారీ
- పౌరుడి పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికేట్, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, స్టడీ గ్యాప్ సర్టిఫికేట్
- తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆదేశాలు
తెలంగాణలో ఇప్పటివరకు తహసీల్దారు కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ద్వారా అందుతున్న తొమ్మిది రకాల సేవలు ఇక నుంచి ‘మీ సేవ’ ద్వారా అందనున్నాయి. దీనికి వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. 9 రకాల పత్రాలకు సంబంధించిన వివరాలను తక్షణమే మీ సేవ ఆన్ బోర్డ్‌లో ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
అందుబాటులోకి రానున్న తొమ్మిది కొత్త సేవల్లో స్థానికత నిర్ధారణ ధ్రువీకరణ పత్రం, క్రిమీ లేయర్, నాన్ క్రిమీలేయర్ ధ్రువీకరణ పత్రాలు, స్టడీ గ్యాప్ సర్టిఫికేట్, పౌరుడి పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికేట్, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ఆర్ఓఆర్-1బీ సర్టిఫైడ్ కాపీలు, మార్కెట్ విలువ మీద ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ రికార్డులకు (ఖాస్రా, పహాణీ) సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి.