- నటి సిమి గరేవాల్‌తో కొన్నాళ్లపాటు రతన్ టాటా డేటింగ్
- ఆ తర్వాత విడిపోయినా స్నేహం కొనసాగింపు
- రతన్ తో వున్న ఫొటోను షేర్ చేసిన సిమి
- ఆయన పరిపూర్ణ మానవుడని ఓ ఇంటర్వ్యూలో కితాబు
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతి దేశంలోని చిన్నాపెద్దా అందరినీ కలచివేసింది. దేశం ఓ ‘రత్నాన్ని’ కోల్పోయిందని బాధాతప్త హృదయాలతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా, ఆయన మాజీ ప్రేయసి, సినీ నటి సిమి గరేవాల్ కూడా స్పందించారు. దశాబ్దాల క్రితం సిమి-రతన్ టాటా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విడిపోయినా స్నేహితులుగా కొనసాగారు. సిమి తాజాగా తామిద్దరూ కలిసున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘నీవు వెళ్లిపోయావని వారు చెబుతున్నారు. కానీ, నిన్ను కోల్పోయిన బాధను భరించడం కష్టం. వీడ్కోలు నేస్తమా’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ తగిలించారు.
రతన్ టాటాతో డేటింగ్ గురించి సిమి ఒకసారి బయటపెట్టారు. బాలీవుడ్‌లో క్రియాశీలంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు తాము డేటింగ్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత విభేదాల కారణంగా దూరమైనా స్నేహితులుగా మాత్రం కలిసున్నామన్నారు.
2011లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమి మాట్లాడుతూ ఆయన పరిపూర్ణత, సెన్సాఫ్ హ్యూమర్ తనను కట్టిపడేసేవని, ఆయన పరిపూర్ణ వ్యక్తి అని కొనియాడారు. డబ్బు గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించేవారు కాదని, అది ఆయనకు ఎప్పుడూ చోదకశక్తి కాలేదని పేర్కొన్నారు. అయితే, విదేశాల్లో ఉన్నంత ప్రశాంతంగా ఇండియాలో ఉండలేకపోయారని పేర్కొన్నారు. సిమి గరేవాల్ లుధివేనియాలో ఓ ఆర్మీ అధికారికి జన్మించారు. 1962లో ఓ ఇంగ్లిష్ సినిమాతో నటనలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. బెంగాలీ సినిమాల్లోనూ నటించారు.