హర్యానాలో కాంగ్రెస్ తప్పిదాలే బీజేపీ గెలుపుకు కారణం … ఒవైసీ
ఈవీఎంలను తప్పుపట్టడం పట్ల అభ్యంతరం
బీజేపీ తమ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంది
కాంగ్రెస్ కుమ్ములాటలు బీజేపీ తెలివిగా ఉపయోగించుకుంది
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై గెలుపును చేజేతులారా జారవిడుచుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు..తమ ఓటమికి ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపట్టడంపై ఆక్షేపణ తెలిపారు. ఈవీఎంలను తప్పుపట్టడం చాలా సులభమని, ఈవీఎంల వల్ల మీరు (కాంగ్రెస్) నెగ్గినప్పుడు మాట్లాడరని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పు పడుతుంటారని అన్నారు.
”ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయేందుకు అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయి. హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాల వల్లే బీజేపీ గెలిచింది. పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది” అని ఒవైసీ విశ్లేషించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా ఉపయోగించుకుని ఉండాల్సిందని, కానీ ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు బీజేపీకి లబ్ధి చేకూర్చాయని అన్నారు. బీజేపీకి ఏ చిన్న అవకాశం ఇచ్చినా ఎన్నికల్లో దానిని తమకు అనూకులంగా మార్చుకుంటుందని చెప్పారు.
బీజేపీ విజయానికి విద్వేష ప్రచారమే కారణమని అనడం సరికాదని 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా తాను చెప్పానని, సమయం వచ్చినప్పుడు కూడా తాను తరచు ఈ విషయం చెబుతూనే ఉంటానని అన్నారు. ”మరి బీజేపీ విజయానికి కారణం ఎవరు? మీరే (కాంగ్రెస్) ప్రధాన విపక్షంగా ఉన్నారు. బీజేపీని ఓడించే సువర్ణావకాశం మీకు ఉంది. కానీ ఆ అవకాశం ఉపయోగించుకోవడంలో మీరు విఫలం అయ్యారు” అని కాంగ్రెస్ పార్టీని ఒవైసీ తప్పుపట్టారు.