- ఏపీలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం
- వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి వలసలు
- నిన్న టీడీపీలో చేరిన మోపిదేవి
- రమణన్నకు తక్కువేమీ చేయలేదన్న జగన్
- ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిగా అవకాశమిచ్చానని వెల్లడి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు అధికమయ్యాయి. నిన్న మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. మోపిదేవి అన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నా క్యాబినెట్లో మంత్రిగా చోటిచ్చి గౌరవించాను అని వెల్లడించారు.
“మనం 151 స్థానాలను గెలిచినప్పుడు రమణన్న గెలవలేదు… ఓడిపోయిన 24 స్థానాల్లో రమణన్న పోటీ చేసిన స్థానం కూడా ఉంది. అయినా కూడా నేను రమణన్నను మర్చిపోలేదు. ఎమ్మెల్సీలు రద్దు చేయాలనుకున్నప్పుడు మళ్లీ వీళ్ల పదవులు పోతాయేమోనని రాజ్యసభకు పంపించాం. అందుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఆయన ఇప్పుడు అడిగినా మళ్లీ రాజ్యసభకు పంపించేవాడ్ని.
మొదటిసారిగా మత్స్యకార వర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపించింది వైసీపీ పాలనలోనే. మోపిదేవి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాలంలో ఎక్కడా ఆయనను తక్కువ చేసింది లేదు. ఆయన పదవీకాలం ముగిసినా, మళ్లీ రీ నామినేట్ చేయాల్సి వస్తే తప్పకుండా చేసి ఉండేవాళ్లం.
మనం ఎక్కడా తప్పు చేయలేదు… మంచికి ఎప్పుడూ దేవుడు సాయం చేస్తాడు. మంచి చేసే మనసు ఉన్నప్పుడు దేవుడు కచ్చితంగా తోడుగా నిలబడతాడు” అంటూ జగన్ పార్టీ శ్రేణులతో సమావేశంలో వివరించారు.