ముంబయిలో నమ్మశక్యం కాని ఘటన… కుంగిన భూమిలోకి జారిపోయిన కారు
ముంబయిలో భారీ వర్షాలు
ఎక్కడ చూసినా నీళ్లే
ఘట్కోపర్ ప్రాంతంలో కుంగిన భూమి
అదే ప్రదేశంలో కారు పార్కింగ్
నిట్టనిలువుగా మునిగిన కారు
ముంబై : గత కొన్నిరోజులుగా ముంబయి నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. నిలిపి ఉంచిన కారు… ఒక్కసారిగా భూమి కుంగిపోవడంతో, ఆ గుంతలోకి జారిపోయింది. కుంగిన భూమిలో నీరు ఉబికి రాగా, ఆ నీటిలో కారు పూర్తిగా మునిగిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది . దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. అయితే ఆ కారుకు అటూ ఇటూ నిలిపి ఉంచిన వాహనాలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.
దీనిపై ముంబయి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఆ కారు నిలిపి ఉంచిన ప్రాంతంలో ఒకప్పుడు బావి ఉండేదని, కాలక్రమంలో దాన్ని మట్టితో నింపేశారని తెలిపారు. కొందరు దానిపై కాంక్రీట్ వేసి పార్కింగ్ ఏరియాగా మార్చుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో, భూమి కుంగిపోయి ఉంటుందని వివరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.