- మృతుల్లో చిన్నారి, ఏడుగురు మహిళలు
- పాఠశాలలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న అనుమానంతో దాడి
- చనిపోయింది శరణార్థులన్న పాలస్తీనా
పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారి, ఏడుగురు మహిళలు ఉన్నారు. ఓ పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయగా, దానిని లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో పాఠశాల ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై ఎగిరిపడ్డాయి. స్కూల్‌లో ఉగ్రవాదులు ఉండడంతోనే దాడి చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది.
మరోవైపు, లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడిలో తమ సహాయక ప్రతినిధులు ఇద్దరు గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 11 మంది మృతి చెందగా 48 మంది గాయపడ్డారు.