- దసరా వరుస సెలవులతో ఊళ్లకు వెళ్తున్న ప్రజలు
- బోసిపోతున్న నగర రహదారులు
- ఖాళీగా తిరుగుతున్న సిటీ బస్సులు
అనధికారికంగా దాదాపు కోటిన్నర జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరం నిర్మానుష్యంగా మారిపోయింది. దసరా పండుగకు గాను ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లడంతో నగరంలోని రహదారులు బోసిపోతున్నాయి. పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు.
హైదరాబాద్ లోని సిటీ బస్సులు సైతం తక్కువ ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. గత బుధవారం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరాన్ని వీడారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. ప్రైవేట్ బస్సులు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలల సెలవులు ఈ నెల 14తో ముగియనున్నాయి. దీంతో, ఊళ్లకు వెళ్లిన వారంతా రాబోయే మంగళ, బుధవారాల్లో మళ్లీ హైదరాబాద్ కు చేరుకోనున్నారు.