- సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మూడో చిత్రం
- కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే కథాంశంతో చిత్రం
- 2026 జనవరిలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటన
టిల్లుగా, టిల్లు స్క్వేర్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ చిత్రంతో పాటు కోన నీరజ డైరెక్షన్‌లో ‘తెలుసు కదా’ అనే చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. దీంతో పాటు సిద్దు మరో చిత్రాన్ని అంగీకరించాడు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం నేపథ్యంలో కొనసాగే ఈ కథకు రవికాంత్ పేరెపు దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విజయ దశమి సందర్భంగా విడుదల చేశారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భద్రకాళి మాత మహిమగా నిలిచిన ఐకానిక్ కోహినూర్ వజ్రం సామ్రాజ్యవాదుల చేతికి చిక్కింది… కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాల్లోకి తీసుకురావడానికి యువకుడు సాగించే చారిత్రాత్మక ప్రయాణంగా ఈ చిత్రం రూపొందనుందని మేకర్స్ చెబుతున్నారు.
‘కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం’ అనే సంచలన కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, ఇలాంటి కథాంశంతో భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు సినిమా రాలేదని దర్శకుడు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సోషియో-ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2026 జనవరిలో విడుదల చేస్తామని నిర్మాతలు అంటున్నారు. ఇంతకు ముందు ఈ చిత్ర దర్శకుడు ‘క్షణం’ చిత్రంతో పాటు సిద్ధు జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు.