- హైదరాబాదులో టీమిండియా × బంగ్లాదేశ్
- మూడో టీ20లో 133 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా
- సిరీస్ 3-0తో క్లీన్ స్వీప్
బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా… అదే ఊపులో టీ20 సిరీస్ ను కూడా ఊడ్చిపారేసింది. ఇవాళ బంగ్లాదేశ్ తో హైదరాబాదులో జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా విజేతగా నిలిచింది. రికార్డు స్కోరు నమోదు చేసిన ఈ మ్యాచ్ లో టీమిండియా 133 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
298 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. బంగ్లా ఇన్నింగ్స్ లో తౌహీద్ హృదయ్ 63 (నాటౌట్), లిట్టన్ దాస్ 42 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు.
ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, మయాంక్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ 1, నితీశ్ రెడ్డి 1 వికెట్ తీశారు.
ఇటీవలే పాకిస్థాన్ జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించి భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ కు ఒక్క మ్యాచ్ లోనూ విజయం దక్కలేదు.
కాగా, ఈ మ్యాచ్ లో భారత్ తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేయడం తెలిసిందే. టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డు నేపాల్ (314) పేరిట ఉంది. ఓవరాల్ గా చూస్తే టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. అయితే టెస్టు ఆడే జట్లలో టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు మాత్రం టీమిండియాదే.