- 30ఏళ్లుగా మధుమేహాన్ని నియంత్రిస్తున్నట్లు చెప్పిన కర్ణాటక సీఎం
- వైద్యుల సలహాలను పాటిస్తూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని వెల్లడి
- క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని సూచన
సరైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం (షుగర్) నియంత్రణ సాధ్యమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. రాష్ట్రంలో గృహ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలను పంచుకున్నారు. తాను ప్రతి రోజు వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతోనే 30 ఏళ్లుగా షుగర్ వ్యాధిని నియంత్రిస్తూ వచ్చానని చెప్పారు.
తాను స్టెంట్ వేయించుకుని 24 ఏళ్లు అయిందని, అయినప్పటికీ వైద్యుల సలహాలు పాటిస్తూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నానని సీఎం సిద్దరామయ్య తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే క్యాన్సర్ కూడా నయం అవుతుందన్నారు. మధుమేహం, బీపీలను విజయవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. అయితే ఇందుకు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమంటూ పలు సూచనలు చేశారు.
చాలా మంది ఆర్ధిక పరిమితుల కారణంగా ఆరోగ్య పరీక్షలకు దూరంగా ఉంటుంటారని, ఇది గుర్తించలేని వ్యాధులకు దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రధానంగా ఒత్తిడితో కూడిన జీవితం అనారోగ్యానికి కారణమని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇప్పుడు రసాయనాలు వాడే ఆహార పదార్ధాల వాడకం పెరగడంతో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు.