- ఎక్కడ చూసినా దోమలతో ముసురుకుంటున్న రోగాలు
- కృత్రిమ మస్కిటో రిపెల్లెంట్లతో అనారోగ్య సమస్యలు
- కొన్ని మొక్కలతో సహజంగా దోమలను దూరం పెట్టవచ్చంటున్న నిపుణులు
ఎండాకాలం లేదు… వానాకాలం లేదు… ఎప్పుడు చూసినా దోమలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడీ చలికాలంలో అయితే… ఫ్యాన్ వేస్తే చలిగా ఉంటుంది. వేయకుంటే దోమలు జుమ్మంటూ రొదపెడతాయి, కుట్టి కుట్టి నిద్ర లేకుండా చేస్తాయి. అదే మనం ఇంటి ముందు, వెనుక, బాల్కనీలో కొన్ని రకాల మొక్కలు పెంచితే దోమలు రానే రావు. పైగా ఈ మొక్కలతో అందం, ఆరోగ్యం అదనపు లాభాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మస్కిటో రిపెల్లెంట్ల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలూ ఉండవని స్పష్టం చేస్తున్నారు.
లావెండర్
అద్భుత సువాసనకు మారుపేరైన లావెండర్ దోమలను దూరం పెడుతుంది. దీని సువాసన మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. మంచి నిద్రకూ తోడ్పడతుంది. చర్మంపై గాయాలను, మొటిమలను తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు ఇస్తుంది.
సిట్రోనెల్లా గ్రాస్
నిమ్మగడ్డి దోమలనే కాదు ఇతర కీటకాలనూ దూరంగా ఉంచుతుంది. అదే సమయంలో మంచి సువాసననూ ఇస్తుంది. ఇంట్లో సువాసన కోసం వాడుకోగలగడం అదనపు ప్రయోజనం
క్యాట్నిప్ మొక్కలు
పిల్లులకు మత్తు కలిగించే క్యాట్నిప్ మొక్కలు కూడా దోమలకు శత్రువులే. ఈ మొక్కలను పెంచితే పరిసరాల్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
తులసి, బాసిల్
బాసిల్ జాతికి చెందిన తులసి, ఇతర మొక్కలు కూడా దోమలు, కీటకాలను దూరం పెడతాయి. అంతేకాదు వాటి నుంచి మంచి సువాసన కూడా ఉంటుంది. వంటల్లోనూ వాడుతారు. తులసి ఆకులైతే మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
బంతి మొక్కలు
బంతి పూల మొక్కలు ఉంటే దోమలు పరారు కావడం ఖాయం. మన ఇంటి పెరట్లో, బాల్కనీలలో ఈ మొక్కలను పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పైగా పూలతో అందం, అలంకరణకూ వాడుకోవచ్చు.
లెమన్ బామ్
పుదీనా జాతికి చెందిన లెమన్ బామ్ మొక్కలూ దోమలు, పురుగులను నిరోధిస్తాయి. దీని ఆకులను తీసుకుంటే.. మానసిక ఒత్తిడి తగ్గి, మంచి నిద్రకు తోడ్పడుతుంది.
రోజ్ మేరీ…
రోజ్ మేరీ దోమలను దూరంగా ఉంచడమేకాదు. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ కలిగిస్తుంది. తల వెంట్రుకలు రాలిపోకుండానూ చూస్తుంది. పాస్తా, పిజ్జాలలోనూ రోజ్ మేరీని వినియోగిస్తారు.
ఫ్లాస్ ఫ్లవర్
మస్కిటో రిపెల్లెంట్ స్ప్రేలలో వాడే పదార్థాలను ఫ్లాస్ ఫ్లవర్ మొక్కల నుంచి తీస్తారు. ఇవి దోమలు, కీటకాలను దూరం పెట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మొక్క ఆకులను మండించడం ద్వారా వచ్చే పొగ బాగా పనిచేస్తుంది.