- అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్‌ఎస్ పార్టీ
- కొంతకాలం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కే పరిమితమైన కేసీఆర్
- బీఆర్‌ఎస్ గుర్తు ‘కారు’ కావడంతో.. ఇక కారు జోరేనంటూ కామెంట్లు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు స్వయంగా కారు నడిపారు. కేసీఆర్ కొన్ని నెలలుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లోనే గడుపుతున్నారు. తనను కలవాలనుకునే పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులను అక్కడికే పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన ఫామ్ హౌజ్ లో కారు నడుపుతూ కనిపించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నం కూడా కారు కావడం విశేషం.
ఇక ‘కారు’దే జోరు…
కేసీఆర్ స్వయంగా కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం, లోక్ సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినడంతో … బీఆర్‌ఎస్ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. ఈ క్రమంలో త్వరలోనే కేసీఆర్ తెరపైకి వస్తారని ప్రచారం జరుగుతోంది. దానికి ఈ కారు నడిపిన వీడియోతో మరింత ఉత్సాహం వచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ చిహ్నం ‘కారు’ను గుర్తు చేస్తూ… కేసీఆర్ కారు నడపడాన్ని ప్రస్తావిస్తూ… ఇక భవిష్యత్తులో ‘కారు’ జోరు అందుకుంటుందంటూ కామెంట్లు వస్తున్నాయి.