కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ను తిలకించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై, వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సందర్శించి తిలకించారు.
శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ కు చేరుకొన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కలెక్టరేట్ ఆవరణలో ఫోటో ఎక్జిబిషన్, స్టాల్స్ లను సందర్శించి తిలకించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వివిధ శాఖల ద్వారా ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు. పర్యాటక ప్రదేశాలపై సమాచార శాఖ, జిల్లా పర్యాటక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ గవర్నర్ పరిశీలించారు. జిల్లాలోని జాఫర్ బావి, ఖమ్మం ఖిల్లా, లకారం లేక్ సస్పెన్షన్ బ్రిడ్జి, వైరా లేక్, పాలేరు రిజర్వాయర్, బోటింగ్,నేలకొండపల్లి లోని బుద్ధ స్తూపం, జమలాపురం వేంకటేశ్వర స్వామి టెంపుల్, కూసుమంచి శివాలయం, కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ మొదలగు పర్యాటక ప్రదేశాల వివరాలను కలెక్టర్ వివరించారు.
వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ లో పంట రుణమాఫీ, డ్రం సీడర్ పద్ధతిలో వరి సాగు, సేంద్రీయ వ్యవసాయం, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మిల్లెట్స్, ఆయిల్ పామ్ మొక్కల పెంపకం, రైతులకు కలిగే ప్రయోజనాలు తెలుపుతూ ప్రదర్శించిన వాటిని గవర్నర్ పరిశీలించి అభినందించారు.
గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వొకేషనల్ ట్రైనింగ్ శిక్షకులు, విద్యార్థినిలు తయారు చేసిన చేతి వృత్తులను, ఇందిరా మహిళా శక్తి వారి చాగంటి లావణ్య మిల్లెట్ స్నాక్స్, సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగ శాల ప్రదర్శనను గవర్నర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఇఓ సోమశేఖర శర్మ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.