Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి…మంత్రులు పొంగులేటి,తుమ్మల

ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి

  • సకల ఉద్యోగుల వనసమారాధన రాష్ట్ర మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు
  • రాబోయే మార్చి తరువాత ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
  • ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ (టి.జి.ఈ.జే.ఏ.సి.) ఆధ్వర్యంలో నిర్వహించిన సకల ఉద్యోగుల కార్తీక మాస వన సమారాధన, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ అతిథులుగా హాజరు కాగా, ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు, చైర్మన్ మారం జగదీశ్వర్ ఆత్మీయ అతిథులకు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ,   ప్రత్యేక రాష్ట్ర సాధనలో 204 ఉద్యోగ సంఘాలు ఏకధాటిగా పోరాటం చేశాయని, వీరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని ఉద్యోగుల కోరడంతో నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగి, మహిళా, రైతు, జర్నలిస్టులు వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే అవకాశం లేదని అన్నారు.  ప్రజా ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుందని,  ఉద్యోగులకు భరోసా కల్పించడమే కాకుండా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు.  

ప్రభుత్వం చిత్తశుద్ధితో దుబారాలు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన డీఏ లను క్రమ పద్ధతిలో మంజూరు చేస్తామని అన్నారు.

రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం చర్చించారని, ఆర్ధికేతర ఇబ్బందులను వచ్చే మార్చి లోపల పూర్తి చేస్తామని అన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా, వారి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఆర్థికంగా ఇబ్బందులేని సమస్యలను ఈ సంవత్సరం క్యాలెండర్ మారే లోపల పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గత ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాను అశ్రద్ద చేసిందని, ప్రస్తుత ప్రభుత్వంలో ఖమ్మం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆనాటి ప్రభుత్వంలో ఉద్యోగులకు స్వేచ్ఛ, గౌరవం లేదని, అనేక ఇబ్బందులు పెట్టారని మంత్రి గుర్తు చేశారు.

గతంలో టీచర్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా టీచర్లకు బదిలీలు, పదోన్నతులు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ ఉద్యోగిని ఎటువంటి ఇబ్బందులకు పెట్టదని తెలిపారు. కొంతమంది ప్రశాంత వాతావరణం పాడు చేసే విధంగా అపోహలు సృష్టిస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేస్తూ ఉద్యోగులపై భారం తగ్గిస్తున్నామని అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,  ఉద్యోగులు కోరుకున్న మార్పు ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ముఖ్యమంత్రి ధైర్యం చేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

బ్యాలెట్ పేపర్ లలో ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజల అవసరాలు గమనించే ఉద్యోగులు ఇచ్చిన తీర్పుగా ఇది భావిస్తామని, ప్రజల కష్టాలను తీర్చగలిగేది ఉద్యోగులు మాత్రమేనని అన్నారు.  ప్రజలు తమకు జరిగే మంచిలో అధికారుల, ఉద్యోగుల పేర్లు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారని మంత్రి తెలిపారు.

ఉద్యోగుల కష్టాన్ని, త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. 40 సంవత్సరాలుగా తన హయాంలో పనిచేసిన అధికారుల కారణంగానే ప్రజలు తనను గుర్తు పెట్టుకున్నారని, రోడ్డు వేసిన, నీటిపారుదల పనులు జరిగిన, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగుల శ్రమ ఉందని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, పూర్వ వైభవం తీసుకుని రావడంలో ఉద్యోగులు దృష్టి సారించాలని అన్నారు.

ఉద్యోగులకు రావాల్సిన ప్రతి అంశాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతని, బాకీలను దశల వారీగా చెల్లిస్తూ ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఉద్యోగులకు తెలుసని, పేద ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఉద్యోగులు నిజాయితీగా పని చేసే శక్తిని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ,   గత 10 నెలల కాలంలో నిర్బంధ ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాక మన హక్కుల గురించి ప్రశ్నించే స్వేచ్ఛ మనకు లభించిందని, సీఎం మన సమస్యల పరిష్కారం కోసం మనతో సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు.

గత పది సంవత్సరాలలో ఉద్యోగుల జేఏసీ లేదని, సర్వీస్ రూల్స్ లేవని , ప్రశ్నిస్తే ప్రతిబంధకాలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారని అన్నారు. రాబోయే మార్చి తర్వాత ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, దీపావళి తర్వాత ఆర్థికేతర సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

రైతులు, మహిళలతో పాటుగా ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ప్రాధాన్యమేనని సీఎం తెలిపారని, ప్రతి ఒక్కరితో చర్చించి ఇచ్చిన మాటలు అమలు చేస్తామని అన్నారు.

ఉద్యోగుల ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ… తెలంగాణ రావడానికి ఖమ్మం జిల్లా చైతన్యం కారణమని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యల పరిష్కారానికి సీఎం ముందుకు వచ్చారని అన్నారు. ఉద్యోసమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణతో పాటు ఆర్కెస్ట్రా, చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశిష్టంగా అలరించాయి.

జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్నం శ్రీనివాస రావును, వనజీవి రామయ్యలను, సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఉద్యోగులను ఉద్యోగ సంఘాల తరపున ఉద్యోగుల ఐకాస రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు వారిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, శాసనమండలి సభ్యులు ఏ. నర్సిరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, టీజీఓ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్య నారాయణ, టి.జి. ఓ. జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేదాద్రి, టి.జి.హెచ్.డబ్ల్యు.ఓ. జిల్లా అధ్యక్షులు కోటిపాక రుక్మారావు, దేవరకొండ సైదులు, నాగిరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు, పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి అజయ్ కుమార్ పై వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నిప్పులు …

Ram Narayana

పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా … మంత్రి పొంగులేటి…

Ram Narayana

తుమ్మలను, నన్ను ఓడించేందుకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారు: పొంగులేటి ఆరోపణ..

Ram Narayana

Leave a Comment