Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై ట్రంప్‌, జో బైడెన్ ప్ర‌త్యేక పోస్టులు

  • ఈరోజే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు
  • ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్‌లో పాల్గొన్న 7.5కోట్ల మంది అమెరిక‌న్లు
  • ఓట‌ర్ల‌ను ఉద్దేశిస్తూ ట్రంప్‌, బైడెన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు
  • ఓట‌ర్లంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఓటింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపు

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈరోజు జరుగుతున్నాయి. సుమారు 24.5 కోట్ల మంది అమెరిక‌న్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల‌కు పైగా ఓట‌ర్లు ఓటు వేశారు. ఈ క్ర‌మంలో ఓట‌ర్ల‌ను ఉద్దేశిస్తూ రిప‌బ్లిక‌న్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థి, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, అధ్య‌క్షుడు జో బైడెన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక పోస్టులు పెట్టారు. ఓట‌ర్లంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా ఓటింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. 

ట్రంప్‌ను క‌మ‌ల‌ ఓడించ‌డం ఖాయం: జో బైడెన్‌
“మ‌రికొన్ని గంట‌ల్లో ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌ను క‌మ‌లా హ్యారిస్ ఓడించ‌డం ఖాయం. అందుకు మీరంద‌రూ ఓటింగ్‌లో పాల్గొనాలి. ముంద‌స్తు ఓటింగ్‌ను వినియోగించుకోని వారంతా పోలింగ్ కేంద్రాల‌కు వెళ్లి ఓటు హ‌క్కు వినియోగించుకోండి” అని బైడెన్ పిలుపునిచ్చారు. 

అమెరికాను మ‌ళ్లీ గొప్ప‌గా తీర్చుదిద్దుకుందాం: డొనాల్డ్ ట్రంప్‌
“మ‌న దేశ చ‌రిత్ర‌లో అత్యంత ముఖ్య‌మైన రాజకీయ ఘ‌ట్టానికి చేరువ‌లో ఉన్నాం. అమెరికాను మ‌ళ్లీ గొప్ప‌గా తీర్చిదిద్దుకుందాం. దీనికోసం మీరంద‌రూ వ‌చ్చి ఓటు వేయండి. క‌మ‌లా హ్యారిస్ అధికారంలోకి వ‌స్తే ప‌శ్చిమాసియా ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతుంది. ఆమె మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని ప్రారంభిస్తార‌ని ఓట‌ర్ల‌కు తెలుసు. అందుకే ట్రంప్‌న‌కు ఓటు వేసి, శాంతిని పున‌రుద్ధ‌రించండి. దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో అతిపెద్ద‌, విస్తృత‌మైన సంకీర్ణాన్ని నిర్మిద్దాం” అని ట్రంప్ అన్నారు. 

క‌మ‌లా హ్యారిస్ విజ‌యం కోసం.. ఇండియాలోని ఆమె పూర్వీకుల పూజ‌లు!

Kamala Harris Ancestral Village In India Prays For Her Election Win

ఈసారి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భార‌తీయ మూలాలు ఉన్న క‌మ‌లా హ్యారిస్ డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌ఫున అధ్య‌క్ష అభ్య‌ర్థిగా బరిలో ఉన్న విష‌యం తెలిసిందే. మొద‌ట అధ్య‌క్షుడు జో బైడెన్‌ను త‌మ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన ఆ పార్టీ, చివ‌రి నిమిషంలో ఆయ‌న త‌ప్పుకోవ‌డంతో అనూహ్యంగా క‌మ‌లకు అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వం ద‌క్కింది. ఆ త‌ర్వాత ఆమె ప్ర‌చారంలో దూసుకెళ్లారు. ఈరోజు అగ్ర‌రాజ్యంలో అధ్య‌క్ష ఎన్నిక‌ల పోలింగ్‌ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ భారతదేశంలోని కమల పూర్వీకులు ఆమె విజ‌యాన్ని కోరుతూ పూజ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మంగళవారం ఎన్నికల రోజున వాషింగ్టన్‌కు దాదాపు 13,000 కిమీ దూరంలో ఉన్న హిందూ దేవాలయంలో పూజ‌లు నిర్వహించనున్నారు.

క‌మ‌లా హ్యారిస్ తాత‌గారు పీవీ గోపాలన్ తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామంలో జన్మించారు. ఇక్క‌డి ఓ ఆలయంలోనే మంగళవారం ఉదయం ప్రత్యేక పూజ‌లు జరుగుతాయని ఆలయ సమీపంలో చిన్న దుకాణం నిర్వహిస్తున్న గ్రామస్థుడు జి.మణికందన్‌ తెలిపారు. అలాగే ఈ ఎన్నిక‌ల్లో ఆమె గెలిస్తే తాము సంబరాలు చేసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. 

2020లో క‌మ‌లా హ్యారిస్‌ డెమోక్రటిక్ పార్టీ త‌ర‌ఫున‌ విజయం సాధించ‌గా ఇదే గ్రామంలో సంబ‌రాలు చేసుకున్నారు. అప్పుడు కూడా ఆమె విజ‌యాన్ని ఆకాంక్షిస్తూ పూజ‌లు నిర్వ‌హించారు. ఏకంగా ఆమెకు ఉపాధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌డంతో వారి సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. ఆమె పదవీ స్వీకారోత్సవాన్ని ఘనంగా జరుపుకుని, బాణసంచా కాల్చి, భోజ‌నాలు పెట్టారు. త‌ద్వారా ఈ గ్రామం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

Related posts

అమెరికాలో దారుణం.. షికాగోలో ఏడుగురిని కాల్చిచంపి పరారైన దుండగుడు

Ram Narayana

వియ‌త్నాంలో ‘యాగి’ తుపాను బీభ‌త్సం.. 141 మంది మృతి!

Ram Narayana

తైవాన్‌లో 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు…

Ram Narayana

Leave a Comment