- కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా
- తుపాను ప్రభావంపై అంచనా వేయడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన కాలిఫోర్నియా యూనివర్సిటీ
- వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
అమెరికా తీర ప్రాంతానికి తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉంది. బాంబ్ సైక్లోన్‌గా నామకరణం జరిగిన దీని ప్రభావం అనేక రాష్ట్రాలపై పెద్ద ఎత్తున ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఈదురు గాలులు, భారీ వర్షాలతో పాటు కొన్ని పర్వత ప్రాంతాల్లో మంచుకు కారణమవుతుందని భావిస్తున్నారు.
ప్రధానంగా కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో సుమారు ఎనిమిది ట్రిలియన్ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అమెరికా పశ్చిమ తీరంలో కొనసాగుతున్న తుపాను కూడా బాంబ్ సైక్లోన్‌గా అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కాలిఫోర్నియా యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.
కేటగిరి 4 పరిస్థితులు ఎదురుకానున్నాయని, దీని ప్రభావంతో దక్షిణ ఓరెగన్, ఉత్తర కాలిఫోర్నియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు.