Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబులో ఎప్పటికీ మార్పురాదు: వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు!

  • చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని మండిపాటు
  • అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • మేం చేసిన పనులు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడని ఆరోపణ

చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని… ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు అబద్ధాలనే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీలు అమలు చేయలేకనే చంద్రబాబు బడ్జెట్‌ను ఆలస్యం చేశారని విమర్శించారు. బడ్జెట్‌ను ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులను చూపించవలసి ఉంటుందన్నారు.

అప్పుల విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ఎల్లో మీడియా తోడైందని మండిపడ్డారు. కాగ్ రిపోర్ట్‌పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. చంద్రబాబును బొంకుల బాబు అని ఎందుకు అనకూడదని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు దిగిపోయే నాటికే పరిమితికి మించి అప్పులు చేశారని, ఆరోగ్యశ్రీ సహా వివిధ బకాయిలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే, తమ హయాంలో 15 శాతం మాత్రమే పెరిగాయన్నారు.

వైసీపీ అధికంగా అప్పులు చేసిందని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇందులో రెండేళ్లు కరోనా కాలం ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు ఏం చెప్పినా వక్రీకరనే ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని తాము రూ.25 లక్షలకు పెంచామన్నారు. తమ హయాంలో చేసిన పనులను కూడా చంద్రబాబు టీడీపీ హయాంలో చేసినట్లుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ కింద తాము ఖర్చు చేసిన రూ.3,762 కోట్లను తమ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ స్కీం కింద ఖర్చు చేసినట్లు చూపించుకున్నారని ఆరోపించారు.

మా కుటుంబంలో విభేదాలున్నాయి… మీకూ కుటుంబం ఉంది కదా: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

  • తల్లి, చెల్లి పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం
  • చంద్రబాబు ఎప్పుడైనా తల్లిదండ్రులను ప్రజలకు చూపించాడా? అని ప్రశ్న
  • తల్లిదండ్రులకు కనీసం రెండు పూటలు భోజనం పెట్టాడా? అన్న జగన్

మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి… మీకూ కుటుంబం ఉంది కదా… తల్లి, చెల్లి పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు? అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తన సోదరి షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా? అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తనపై, తన తల్లిపై, తన చెల్లిపై అసభ్య పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబూ… నీ తల్లిదండ్రులెవరో ప్రజలకు చూపించావా?

చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రజలకు చూపించాడా? అని జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆయన తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నారా? కనీసం వారికి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా ఇంటికి పంపించారా? వారు చనిపోతే కనీసం తలకొరివి పెట్టాడా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడని, ఏ గడ్డి అయినా తింటాడని, ఏ అబద్ధమైనా ఆడుతాడని, ఏ మోసమైనా చేస్తాడని ధ్వజమెత్తారు.

చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉంటారన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా… ఎవరు సీఎంగా ఉంటారనే విషయం వారు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుందన్నారు. పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని అభిప్రాయపడ్డారు.

Related posts

రాయి కొంచెం పక్కకి తగిలి ఉంటే ప్రాణం పోయేది… కొంచెం కింద తగిలి ఉంటే కన్ను పోయేది: సజ్జల

Ram Narayana

ఏపీ పరిణామాలను పరిశీలిస్తున్నామన్న నడ్డా… వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని సుజనాకు సూచన

Ram Narayana

ఒకే రాయి మూడు గాయాలు చేసింది… ఇది ఎలా సాధ్యం?: ఆనం వెంకట రమణారెడ్డి

Ram Narayana

Leave a Comment