- అదానీ జైల్లో ఉండాలన్న రాహుల్ గాంధీ
- కేంద్రంలోని కొందరు పెద్దలు అదానీని కాపాడుతున్నారని విమర్శ
- లంచాల ఆరోపణలను అదానీ ఒప్పుకోరని వ్యాఖ్య
సోలార్ విద్యుత్ కాంట్రాక్టుల కోసం దేశంలోని వివిధ రాజకీయ నాయకులు, అధికారులకు అదానీ గ్రూప్ రూ. 2,200 కోట్ల లంచం ఇచ్చిందనే అభియోగాలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలను కూడా అదానీ అంశం కుదిపేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అదానీని కాపాడుతున్నారని… అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. చిన్న విషయాలకే వందలాది మందిని అరెస్ట్ చేస్తున్నారని… అదానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అదానీ జైల్లో ఉండాలని అన్నారు. తనపై వచ్చిన లంచాల ఆరోపణలను అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ మాట్లాడుతూ… రాజకీయ లబ్ధి కోసం అదానీ వ్యవహారాన్ని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. అమెరికా న్యాయస్థానంలో వచ్చిన ఆరోపణలను గుడ్డిగా అనుసరించడం సరికాదని అన్నారు.