- తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘటన
- సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలు
- దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్న వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కారును దుండగులు ధ్వంసం చేశారు. హైదరాబాద్ అంబర్ పేటలో ఆయన ఇంటి ముందు ఉన్న కారును మరో వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి.
దాడికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఢీకొట్టిన వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ… తన వాహనంపై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి అని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
గతంలో కూడా వీహెచ్ వాహనంపై దాడి జరిగింది. 2022 ఏప్రిల్ 14 అర్ధరాత్రి ఒక వ్యక్తి ఆయన కారు అద్దాలను ఇనుపరాడ్ తో పగలగొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు…. నిందితుడిని ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన వికాస్ సింగ్ గా గుర్తించి అరెస్ట్ చేశారు.