- ప్రజలని మోసం చేయడమే చంద్రబాబు పాలసీ అన్న అనంత వెంకట్రామిరెడ్డి
- వెంకట్రామిరెడ్డి కబ్జా చేసిన ఐటీఐ కళాశాల గేటు పగలగొడతానంటూ జేసీ వార్నింగ్
- తమ నాయకులను విమర్శిస్తే ఇంటికి వచ్చి చెప్పుతో కొడతానన్న ప్రభాకర్ రెడ్డి
తాను చంద్రబాబు అంత మంచోడ్ని కాదు అంటూ టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కూటమి నేతలను, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు.
అధికారం కోసం అమలు చేయలేని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక ప్రజలని మోసం చేయడమే చంద్రబాబు పాలసీ అని విమర్శించిన అనంత వెంకట్రామిరెడ్డి.. కూటమి నేతలు కేవలం డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టారు గానీ ప్రజల సమస్యల మీద గానీ, ప్రజల కోసం గానీ పని చేయడం లేదని అన్నారు. ప్రజలు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ బూతు పురాణంతో రెచ్చిపోయారు. అసలు, ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదంతో నాకేమిటి సంబంధం అని జేసీ ప్రశ్నించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు .. కోపం, తాపం, రోషం ఉన్నా.. పక్కన పెట్టారని జేసీ అన్నారు. తాను చంద్రబాబు అంత మంచివాడిని కాదని, కోపం, తాపం, రోషం వున్నాయని, అలాగే కొట్టడం కూడా తెలుసు అంటూ హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని జేసీ మండిపడ్డారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని, ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని జేసీ పిలుపునిచ్చారు.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతానంటూ జేసీ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇంటి పక్కన ఉన్న ఐటీఐ కళాశాల భూమిని కబ్జా చేసి గేటు పెట్టాడని ఆరోపించారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆ ఇంటికి వెళ్లి గేట్లు పగలగొడతామని జేసీ హెచ్చరించారు.