- ముంబై నుంచి మాంచెస్టర్ వెళుతున్న విమానంలో మంటలు
- కువైట్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్
- కనీసం కూర్చోవడానికి కూడా సదుపాయం కల్పించలేదంటూ ప్రయాణికుల మండిపాటు
ముంబై నుంచి మాంచెస్టర్ బయలుదేరిన ప్రయాణికులు కువైట్ ఎయిర్ పోర్టులో దాదాపు 19 గంటల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు ప్రయాణిస్తున్న గల్ఫ్ ఎయిర్ విమానం అత్యవసరంగా కువైట్ లో ల్యాండ్ కావడంతో ఈ సమస్య ఎదురైంది. ఎయిర్ పోర్ట్ లో భారతీయులకు కనీసం కూర్చోవడానికి కూడా సదుపాయం కల్పించలేదని, నాలుగు గంటల దాకా తాగడానికి నీళ్లు అడిగినా ఇవ్వలేదని ప్రయాణికులు తీవ్రంగా మండిపడ్డారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్ ఎయిర్ కు చెందిన విమానం ఆదివారం ముంబై నుంచి మాంచెస్టర్ కు బయలుదేరింది. ఇంజన్ లో పొగ, మంటలు రావడంతో పైలట్ విమానాన్ని కువైట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను దింపి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు. సాధారణంగా ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినపుడు కానీ, విమానం ఆలస్యం అయినపుడు కానీ ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ సమీపంలోని హోటళ్లలో వసతి ఏర్పాటు చేస్తారు.
కువైట్ లో మాత్రం ట్రాన్సిట్ వీసా లేదంటూ భారతీయ ప్రయాణికులను కనీసం ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి కూడా అనుమతించలేదు. విషయం తెలిసి కువైట్ లోని భారత రాయబార కార్యాలయం స్పందంచడంతో లాంజ్ లోకి అనుమతించారు. ఆ తర్వాత కూడా కనీస సదుపాయాలు కల్పించలేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కువైట్ లో జీసీసీ సమిట్ జరుగుతోందని, ఎయిర్ పోర్ట్ లోని హోటల్ లో ఖాళీ లేదని చెప్పారన్నారు.
కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో లాంజ్ లో కిందనే కూర్చున్నామని, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాపోయారు. జీసీసీ సమిట్ కారణంగా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసివేయడంతో భారతీయులకు సాయం అందడంలేదని రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. దాదాపు 19 గంటల తర్వాత సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు వారి విమానం మాంచెస్టర్ కు బయలుదేరిందని వివరించారు.