తెలంగాణ వార్తలు

పోరాటాలే అమరులకు సరైన నివాళి..పోటు ప్రసాద్ ఆశయ సాధనకు పునరంకితమవుదాం..

ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ బహుముఖ పోరాటాలకు నేతృత్వం వహించి అమరులైన వారికి ప్రజా పోరాటాల కొనసాగింపే సరైన నివాళి అని ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ తెలిపారు. విద్యార్థి దశ నుంచి కార్మిక నాయకునిగా, కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన పోటు ప్రసాద్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. గత నెల 27న మరణించిన సిపిఐ ఖమ్మంజిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ సంస్కరణ సభ ఖమ్మంలోని పాత మమత మెడికల్ కళాశాలలోని పువ్వాడ ఆడిటోరియంలో జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ పోటు ప్రసాద్ కుటుంబం మూడు తరాల నుంచి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ వచ్చారని మూడో తరం వారైనా పోటు ప్రసాద్ విద్యార్థి ఉద్యమంలోనూ, కార్మిక ఉద్యమంలోనూ ఎంతో నిబద్ధతతో పని చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ శ్రేణులను ప్రజా పోరాటాలకు సన్నద్దం చేసేవారని కౌర్ తెలిపారు. పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఈ దశలో ప్రజా పోరాటాల ఉదృతి అవసరమని ఈ సమయంలో ప్రసాద్ మరణం యావత్ ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. మోడీ పాలనలో ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం పెరిగి వేతన జీవులు ఎగువ, దిగువ, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. దేశ సంపద ఒక శాతం మంది వద్ద పోగుపడుతుందని 90 శాతం మంది ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నారన్నారు. దేశ జనాభాలో యువకుల శాతం పెరుగుతూ యువ భారత్ గా మారుతుందని అదే సమయంలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అమర్జిత్ తెలిపారు. యువశక్తి నిర్వీర్యం అవుతుందని ప్రభుత్వ రంగంలోని నియామకాలు లేవని ప్రభుత్వ రంగాన్ని మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తూ అంబానీ, అదానీలకు కట్ట బెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 25 శాతం మంది రోజు వారి కూలీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా పలు పోరాటాలు మొదలవుతున్నాయన్నారు.

సాంకేతిక విద్యతో పాటు వివిధ కోర్సుల్లో పేజీలు సాధించి ఉపాధి కోసం డిగ్రీలు చేతపట్టుకుని తిరుగుతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని సైతం మోడీ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని మూడు నూతన సాగు చట్టాలను తీసుకువచ్చి రైతులను ఇబ్బందులు పెట్టారన్నారు. సుదీర్ఘ కాలం దేశ రాజధాని సరిహద్దుల్లో మిలిటెంట్ పోరాటం తర్వాత వెనక్కి తగ్గిన మళ్లీ దొడ్డిదారిన అమలు చేసేందుకు మోడీ పూనుకుంటున్నారని కౌర్ ఆరోపించారు. అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను సైతం కేంద్ర ప్రభుత్వం హరించివేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను పాలకులు మోసం చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కుల కోసం పోరాడుతున్న క్రమంలో ప్రసాద్ లాంటి పోరాట యోధుడు మరణించడం దురదృష్టకర పరిణామమన్నారు. విద్యారంగాన్ని కాషాయికరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని కౌర్ పిలుపునిచ్చారు. 44 సంవత్సరాల క్రితం ఖమ్మం వచ్చానని మళ్లీ ఇటువంటి విషాద సమయంలో రావడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు.

ప్రసాదు నివాళిగా శత వసంత ముగింపు సభ: కూనంనేని

తుదిశ్వాస వరకు నిబద్ధత, నిస్వార్ధంతో కమ్యూనిస్టు పార్టీ పురోభివృద్ధికి కృషి చేసిన పోటు ప్రసాద్కు నివాళిగా సిపిఐ శత వసంతాల జాతీయ స్థాయి ముగింపు సభ ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన అన్నారు. పోటు ప్రసాద్ సంస్మరణ సభలో కూనంనేని మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన

కుటుంబం నుంచి వచ్చిన పోటు ప్రసాద్ పార్టీ భావజాల వ్యాప్తిలో ముందు వరుసలో నిలిచారన్నారు. ఖమ్మంజిల్లా కమ్యూనిస్టు పార్టీని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో పోటు ప్రసాద్ కృషి ఎనలేనిదన్నారు. త్యాగాన్ని సంపదగా మార్చుకున్న కుటుంబం వారిదని త్యాగాలకు, పోరాటాలకు ప్రతీకగా పోటు కుటుంబం మారిందని ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్న కమ్యూనిస్టులమని గర్వంగా చెప్పుకుంటారని కూనంనేని తెలిపారు. గంగినేని వెంకటేశ్వరరావు రచించిన ఎర్ర జెండాల పుస్తకంలోనూ, సుందరయ్య రచించిన ఆదర్శ కుటుంబాల పుస్తకంలోనూ పోటు ఎర్రమ్మ కుటుంబానికి సముచిత స్థానం ఇవ్వడం గర్వంగా ఉందని ఈ సందర్భగా సాంబశివరావు తెలిపారు. పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని కమ్యూనిస్టు భావజాలం సమస్యలు ఉన్నంత కాలం వ్యాప్తి చెందుతుంది తప్ప ఆగిపోదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ మావోయిస్టులను తుద ముట్టిస్తామని చెప్పడం అవివేకమేనని అది సాధ్యం కాదన్నారు. ప్రసాద్ మరణంతో ఓ విప్లవ గొంతుక మూగబోయిందని ప్రసాద్ స్పూర్తితో భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, మాజీ శాసన సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, గుమ్మడి నర్సయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, ఆంధ్రప్రదేశ్ సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, వనజ, కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుమ్మల యుగంధర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పర్షా

పద్మ, బాగం హేమంతరావు, బఏఎల్ నాయకులు పోట్ల మాధవరావు, జర్నలిస్టు సంఘాల నాయకులు కె. రాంనారాయణ, ఎ. ఆదినారాయణ తదితరులు ప్రసంగించగా గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎంఎల్సి పోట్ల నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు ఎస్, సాబీర్ పాషా, మహ్మద్ మౌలానా, బి. అయోధ్య, ప్రసాద్ కుమారుడు రాజా సాత్విక్, సతీమణి పోటు నిర్మల, తల్లి సక్కుబాయి, సోదరి. పోటు కళావతి, పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఎసికె జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, కార్పొరేటర్ బిజి క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆలోచింపజేశాయి.

ప్రశ్నించే గొంతుక మూగబోయింది..ప్రసాద్ సంస్మరణ సభలో అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి

ప్రజల పక్షాన రాజ్యాంగ బద్దమైన హక్కుల కోసం ప్రశ్నిస్తూ పోరాడే పోటు ప్రసాద్ మరణంతో ప్రశ్నించే గొంతుక మూగబోయిందని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని పువ్వాడ ఆడిటోరియంలో జరిగిన పోటు ప్రసాద్ సంస్మరణ సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ మరణం ఓ షాక్ అని ఊహించని ఈ పరిణామం నుంచి కోలుకోవడం పార్టీ శ్రేణులకే కాదు ఆయన సన్నిహితులకు ఇబ్బందికరమేనన్నారు. ప్రసాద్ అనారోగ్యానికి గురై మరణానికి దగ్గరగా ఉన్న దాఖలాలు లేవని అయినా ఆకస్మిక మరణం పొందడం బాధాకరమన్నారు. హక్కుల కోసం ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రసాద్ లాంటి వారిని కోల్పోవడం యావత్ సమాజానికి తీరని లోటన్నారు. హక్కుల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నినదిస్తూ, వివరిస్తూ రాజ్యాంగ హక్కుల అమలుకు పోరాటాలు సాగించే వ్యక్తులను కోల్పోవడం ఈ వ్యవస్థకు చాలా నష్టమన్నారు. పోటు ప్రసాద్ మితభాషి అని ఇలా ఉండేవారిలో సామాజిక పరమైన సంఘర్షణ ఉంటుందన్నారు. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి పోరాటాలు సాగిస్తున్న వ్యక్తులు మరణించడం అట్టడుగు వర్గాల ప్రజలకు తీరని నష్టమన్నారు.

తుదిశ్వాస వరకు పోరాడిన ప్రసాద్ : పువ్వాడ

పోటు ప్రసాద్ తుద్విశ్వాస వరకు ప్రజల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడారని సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. ప్రసాద్ సంస్మరణ సభలో మాట్లాడుతూ విద్యాభ్యాసం కోసం ఖమ్మం వచ్చిన ప్రసాద్ విద్యార్థి ఉద్యమ నేతగా ఎదిగారని కమ్యూనిస్టు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పలు సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటంలో ముందు భాగంలో నిలిచారన్నారు. పోటు ప్రసాద్ కుటుంబం యావత్ పార్టీకి అంకితమై పనిచేసిందని సమాజ మార్పు కోసం ఆ కుటుంబం చేసిన త్యాగం వెలకట్ట లేనిదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కడ వరకు ప్రయత్నించడమే అత్యుత్తమ కమ్యూనిస్టు లక్షణమని ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ ఉండాలని పువ్వాడ సూచించారు.

జిల్లా శాఖను ఆదర్శంగా నిలిపారు :పల్లా వెంకట రెడ్డి

కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల వేళ ఖమ్మం జిల్లా సమితిని రాష్ట్రంలోనే మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలిపిన ప్రసాద్ మహోన్నతుడని నవచేతన విజ్ఞాన సమితి అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు పల్లా వెంకటరెడ్డి తెలిపారు. పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జన్మించిన పోటు ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ నిర్మాణంలో కీలక భూమిక పోషించారన్నారు. పోటు ప్రసాద్ కుటుంబానికి ఎనలేని చరిత్ర ఉందని ఆ కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రసాద్ సిద్దాంతాన్ని ఆచరణలో చూపిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆదర్శవంతమైన విప్లవకారున్ని పార్టీ కోల్పోయిందన్నారు.

ఆదర్శవంతమైన కమ్యూనిస్టు ప్రసాద్: ముప్పాళ్ల

ఆదర్శవంతమైన కమ్యూనిస్టులలో పోటు ప్రసాద్ ఒకరని ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే. ఆయనకు ఇచ్చే నివాళి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ప్రసాద్లో లౌక్యం ఉందని అదే సమయంలో బాధ్యతల విషయంలో రాజీపడే వాడు కాదన్నారు. ఈ సభలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్, ఎ. వనజ, బాగం హేమంతరావు, పశ్య పద్మ, ఎస్ కె సాబీర్్పషా, మహ్మద్ మౌలానా, గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుమ్మల యుగంధర్, పోతినేని సుదర్శన్, పోట్ల మాధవరావు తదితరులు ప్రసంగించారు. ఈ సభకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షత వహించగా రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు.

Related posts

ఐఏఎస్ అరవింద్ కు కార్ రేసు నిధుల విడుదల ఉచ్చు ….!

Ram Narayana

అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులా…? ఇందులో ఎన్ని గంటలు చర్చ …?

Ram Narayana

భారీ వ‌ర్ష సూచ‌న‌.. తెలంగాణ‌లోని ఐదు జిల్లాల్లో స్కూళ్ల‌కు సెల‌వులు…

Ram Narayana