- సంక్రాంతి సందర్భంగా కోడిపందాల జోరు
- కాకినాడ జిల్లాలోనూ కోడిపందాల సందడి
- కోడిపందాల బరి వద్ద థార్ వాహనాన్ని ప్రదర్శిస్తున్న నిర్వాహకులు
సంక్రాంతి పండుగకు కోడిపందాల సందడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా, ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో కోడిపందాల బరుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారతాయన్నది అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని చోట్ల కోడిపుంజులకు కత్తులు కట్టి పందాలు వేస్తుంటారు. కొన్ని చోట్ల డింకీ పందాలు (కత్తులు లేకుండా) నిర్వహిస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే… కాకినాడ జిల్లా కరప మండలంలోనూ భారీ ఎత్తున కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు. ఓ కోడిపందెం బరిలో నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజేతలకు మహీంద్రా థార్ వాహనం బహుమతిగా ఇస్తామని తెలిపారు. అంతేకాదు, కోడిపందెం బరి వద్దే మహీంద్రా థార్ వాహనాన్ని ప్రదర్శిస్తూ, కోడిపందెం రాయుళ్లను ఊరిస్తున్నారు. ఈ వాహనం ఖరీదు రూ.25 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.