తెలంగాణ వార్తలు

కేటీఆర్ కాస్కో..సంక్షేమ పథకాల ప్రవాహంలో నీ పార్టీ కొట్టకపోవడం ఖాయం..డిప్యూటీ సీఎం భట్టి

ఇందిరమ్మ ఇల్లు.. రేషన్ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమే . నువ్వు నీ పార్టీ.. సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయం… నువ్వు నీ పరివారం బ్రమల్లోనే బతకండి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభంలో భాగంగా ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చినగోపతి లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్స్ పంపిణీ చేశారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన ఈరోజు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక గ్రామంలో నూరు శాతం అందిస్తూ లాంచనంగా పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నాలుగు సంక్షేమ పథకాలు వినబడడానికి చిన్నగా ఉండొచ్చు కానీ ఈ పథకాల అమలుకు ఏడాదికి 45 వేల కోట్లు భారం పడుతుంది. అయినా ప్రజలందరికీ మంచి చేయాలని పథకాల పంపిణీ మొదలుపెట్టాము అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోంది.. నిధులు అందుబాటులో ఉన్న గత పది ఏళ్లపాటు మాలాగా టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గత పాలకులు పది సంవత్సరాలు ప్రజల గురించి ఆలోచన చేస్తే మేము ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వాల్సి వచ్చేది కాదు అన్నారు.
భారత రాజ్యాంగం ఈ దేశ జీవన విధానం.. ప్రపంచంలో భారత్ దేశం బలంగా నిలబడడానికి రాజ్యాంగమే పునాదులు వేసింది అన్నారు. హక్కులు, విధులు, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, భావ స్వేచ్ఛకు సంపూర్ణ సహకారం రాజ్యాంగం ద్వారా మనకు లభించాయని తెలిపారు.
రాజ్యాంగానికి భిన్నంగా నడుచుకోవాలని కొందరు చూస్తున్నారు సొంత భావజాలాన్ని ప్రజలపై రుద్దాలని కొందరు ప్రయత్నిస్తున్నారు అన్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తాం అంటూ కేసిఆర్ మాట్లాడితే తగుదునమ్మా అంటూ ఆయన కొడుకు.. దశాబ్ద కాలంగా అల్లాడిన పేద ప్రజలను పట్టించుకోకుండా.. ఒకే గ్రామంలోనే ఇస్తారా అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది అన్నారు. ప్రతి పథకాన్ని సంతృప్త స్థాయి(శాచ్యురేషన్ మోడ్)లో అమలు చేస్తాం అన్నారు.

గత పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలకుల కోసమే వాడుకున్నారు.. ప్రజలను పట్టించుకోలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం సంపద సృష్టిస్తాం, పేద ప్రజలకు పంచుతాం అన్నారు.

గత పాలకులు నాలుగు గోడల మధ్య .. గడిల్లో కూర్చొని లబ్ధిదారులను ఖరారు చేశారు అని ఆరోపించారు. మేము మూడు రోజులు ప్రజల మధ్య గ్రామసభలు పెట్టి
జాబితాలు ప్రకటించి… ఇంకా మిగిలిన వారు ఉంటే దరఖాస్తులు పెట్టుకోమని పిలుపునిచ్చాం అన్నారు. ఇల్లు, రేషన్ కార్డులు రాకుండా సమాజానికి ద్రోహం చేసేవాళ్లు గ్రామసభలో గొడవలు చేయాలని ప్రయత్నం చేశారు.. గ్రామ సభల్లో అధికారులు ప్రకటించే పేర్లే చివరి జాబితా అని ప్రజలను రెచ్చగొట్టాలని టిఆర్ఎస్ నాయకులు చూశారు.. వారి మాదిరిగానే కొద్దిమందికే పథకాలు ఇచ్చి చేతులు దులుపుకుంటామని అనుకున్నారు అన్నారు. కానీ ప్రజలు మా పిలుపును అర్థం చేసుకొని గ్రామసభల్లో లక్షల కొద్ది దరఖాస్తులు చేసుకున్నారు అని తెలిపారు.

లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అన్నిటికీ ఒకేసారి ఇవ్వలేం… 26న మొదలు పెడతామని చెప్పాము కాబట్టి ప్రతి గ్రామంలో లాంచనంగా ఈరోజు నాలుగు పథకాలు ప్రారంభించాము అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వంలో మూడు నెలల వ్యవధిలోనే 22 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశాము. టిఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయారు అని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ నాయకులు ప్రజాధనాన్ని దోపిడీ చేశారు.. మేం మాత్రం సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నాం అన్నారు. సీఎల్పీ నేతగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రతి నిమిషం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం.. నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలే తీసుకుంటాం అని తెలిపారు.

వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నిటికీ షరతులు లేకుండా బరాబర్ లెక్క కట్టి సోమవారం ఉదయానికల్లా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తాం అన్నారు.

ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని తెలిపారు.
10 సంవత్సరాలుగా హాస్టల్ పిల్లలు తింటున్నారో లేదో టిఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. మేము అధికారంలోకి రాగానే సర్వే చేసి డైట్ చార్జీలు 40% కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచామని తెలిపారు.

ప్రపంచంతో పోటీపడేలా ఒక్కో పాఠశాల 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ లకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం అన్నారు. ఏడాది కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 56వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఐదు సంవత్సరాల్లో కోటి మంది డ్వాక్రా మహిళలను వడ్డీ లేని రుణాల ద్వారా కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాలు, విద్యుత్ శాఖ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. సూక్ష్మ మధ్యతరః పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నట్టు తెలిపారు.

Related posts

సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యతలు

Ram Narayana

తెలంగాణలో 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఏపీ మహిళ!

Ram Narayana

ఏకగ్రీవం చేస్తే.. రూ.25 లక్షలిస్తా..!

Ram Narayana