- సౌదీలోని జిజాన్‌లో దుర్ఘటన
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన జెడ్డాలోని భారత ఎంబసీ
- మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్న రాయబార కార్యాలయం
- ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
సౌదీ ఆరేబియాలో బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సౌదీలోని జిజాన్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని జెడ్డాలోని భారత ఎంబసీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని, మృతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని పేర్కొంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది.
జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడానని, ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఇండియన్ కాన్సులేట్ బాధిత కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతోందని అన్నారు. బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఈ ప్రమాదంపై బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడం కోసం అక్కడి ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నెంబర్‌లను ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 8002440003 (టోల్‌ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301 (వాట్సాప్) నెంబర్లలో సంప్రదించాలని తెలిపింది.