Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

వరుసగా శక్తిమంతమైన అస్త్రాలను బయటికి తీస్తున్న రష్యా!

  • అణుశక్తి ఆధారిత ‘పోసిడాన్’ డ్రోన్‌ను పరీక్షించిన రష్యా
  • పరీక్ష విజయవంతమైందని ప్రకటించిన అధ్యక్షుడు పుతిన్
  • ఈ ఆయుధం పరిధి అపరిమితమని వెల్లడి
  • త్వరలో ‘సర్మత్’ క్షిపణిని కూడా మోహరించనున్నట్లు వెల్లడి

వరుసగా శక్తిమంతమైన అస్త్రాలను బయటకు తీస్తూ రష్యా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల అణుశక్తితో పనిచేసే క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన మాస్కో.. తాజాగా మరో శక్తిమంతమైన ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అణు ఇంధనంతో పనిచేసే మానవరహిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించారు. దీని పరిధి అపరిమితమని పేర్కొనడం గమనార్హం.

సైనిక ఆసుపత్రిలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వివరాలు వెల్లడించారు. ‘అణుశక్తితో నడిచే ఆటోమేటిక్, మానవరహిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది రష్యా అమ్ములపొదిలోని అత్యాధునిక ‘సర్మత్’ బాలిస్టిక్ క్షిపణి కన్నా ఎంతో శక్తిమంతమైనది. ఓ జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించాం. ఇందులో అమర్చిన అణు విద్యుత్ ప్లాంట్, వ్యూహాత్మక జలాంతర్గామిలోని రియాక్టర్ కన్నా 100 రెట్లు చిన్నది’ అని పుతిన్ వివరించారు.

ఇదే సమయంలో ‘సర్మత్’ క్షిపణిని కూడా త్వరలోనే సైనిక మోహరింపులకు సిద్ధం చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. ప్రపంచంలో ‘సర్మత్’ వంటి క్షిపణి మరొకటి లేదని ఆయన అన్నారు. ఇటీవల పరీక్షించిన అణుశక్తి ఆధారిత ‘బురెవెస్ట్‌నిక్‌’  క్రూయిజ్ క్షిపణి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆ క్షిపణిలోని అణు రియాక్టర్, జలాంతర్గామిలో వినియోగించే దానికన్నా వెయ్యి రెట్లు చిన్నదని పేర్కొన్నారు.

రష్యా సైన్యం ఇటీవల నిర్వహించిన అణు విన్యాసాలను పుతిన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగానే ‘బురెవెస్ట్‌నిక్‌’ క్షిపణిని పరీక్షించామని, ఆ సమయంలో ఇది 15 గంటల పాటు గాల్లోనే ఉండి 14,000 కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపారు. అయితే, సైద్ధాంతికంగా దీని పరిధి అపరిమితమని ఆయన స్పష్టం చేశారు. తాజా ‘పోసిడాన్’ పరీక్షతో రష్యా తన అణు సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది.

Related posts

పాక్‌తో దోస్తీ.. తుర్కియే, అజర్‌బైజాన్‌లకు భారత పర్యాటకుల గట్టి షాక్!

Ram Narayana

ఎస్సీఓ భేటీలో భారత్ సంచలనం : ఉమ్మడి ప్రకటనపై సంతకానికి రాజ్‌నాథ్ నిరాకరణ

Ram Narayana

మయన్మార్ భూకంప తీవ్రత 334 అణుబాంబుల విస్పోటనంతో సమానమట!

Ram Narayana

Leave a Comment