- యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి నియామకంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- పాలకమండలి నియామక ముసాయిదాలో మార్పులు ప్రతిపాదించిన సీఎం
- ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానం విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే ఈ దేవస్థానానికి పాలకమండలి ఏర్పాటునకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులను ఆయన ఆదేశించారు. పాలకమండలి ఏర్పాటునకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు. బుధవారం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి నియామకపు నిబంధనలపై సమీక్ష జరిపారు.
తిరుమలలో మాదిరిగానే యాదగిరిగుట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆలయం తరపున చేపట్టాల్సిన అధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, పాలకమండలి నియామకంపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనల విషయంలో సీఎం పలు మార్పులు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.