కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు పూనుకోవాలి.
హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం తప్పదు
సిపిఎం నేతలు తమ్మినేని, జాన్ వెస్లీ, ఎస్.వీరయ్య, జూలకంటి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు పూనుకోవాలని సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్యలు అన్నారు. సోమవారం ఖమ్మం సుందరయ్య భవనం నందు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి.జహంగీర్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి ఖమ్మంవరంగల్
నల్గొండ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలులో మొండిచేయి చూపిస్తుందని అన్నారు. 2 లక్షల రూ.ల రుణమాఫీ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారన్నారు. ఎటువంటి కండీషన్లతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే అమలు చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద భూమిలేని ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి 12 వేల రూ.ల చొప్పున తక్షణమే ఇవ్వాలని అన్నారు. గ్రామస్థాయిలో దరఖాస్తులు తీసుకొని అమలులో వచ్చే సరికి ఉపాధిహామీ పనికి లింకుచేసి వేలాది మంది లబ్దిదారులను అనర్హత కింద తేల్చారని, తక్షణమే ఉపాధిహామీ పనులతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేయాలన్నారు. పట్టణాల్లో మున్సిపల్ ఏరియాల్లో భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ ఈ పథకాన్ని అందజేయాలన్నారు. హామీలు ఇవ్వడమే తప్ప, అమలులో చూసే సరికి ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడ మల్లయ్య అన్న చందంగా కాంగ్రెస్ తీరుందని విమర్శించారు. గత ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల అమలులో ఇదే తీరున వ్యవహరించి ఓటమి చవిచూసిందని గుర్తు చేశారు. రైతు భరోసా ద్వారా ఎకరానికి 15 వేల రూ.ల వాగ్దానం నిలబెట్టుకోవాలని, రెండు పడకల గదులను లబ్దిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు చేయలేదు. అయినా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మొక్కుబడిగా కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ ధోరణి, అలసత్వం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపైన పోరాటానికి ముందుకు రావాలని సిపిఎం పార్టీ దీనికి పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళనా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటి సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఎం.డి.అబ్బాస్, మల్లు లక్ష్మి, నున్నా నాగేశ్వరరావు, నాయకులు ఎం.సాయిబాబు, మచ్చా వెంకటేశ్వర్లు, సాదుల శ్రీనివాస్, ఎం.సుధాకర్ రెడ్డి, బందు సాయిలు, బీరెడ్డి సాంబశివ, జి.ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శి జాన్ వెస్లీకి సాదర స్వాగతం పలికిన సిపిఎం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు
ఇటీవల సంగారెడ్డిలో జరిగిన సిపిఎం 4వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీ ఖమ్మంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల జిల్లా కమిటి సభ్యుల రాష్ట్రస్థాయి వర్క్‌షాపులో పాల్గొనుటకు ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం ఆఫీసు వద్ద సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర కమిటి సభ్యులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సాదర స్వాగతం తెలిపారు. రాబోయే కాలంలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి ప్రజా ఉద్యమాలకు సారధ్యం వహించాలని ఆకాంక్షించారు.
స్వాగతం పలికిన వారిలో ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు అన్నవరపు కనకయ్య, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, బండి రమేస్, కళ్యాణం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, ఎ.జె.రమేష్, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, శెట్టి వెంకన్న, యర్రా శ్రీనివాసరావు, మాదినేని రమేష్, బండి పద్మ, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, పార్టీ సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, ఉభయ జిల్లాల జిల్లా కమిటి సభ్యులు, మండల కార్యదర్శులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు అనేక సామాజిక సంఘాల నాయకులు ఆయనకు పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు.