జాతీయ రాజకీయ వార్తలు

ఢిల్లీ ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారు: ప్రధాని మోదీ…

PM Modi speech in BJP Victory rally in Delhi
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయభేరి
  • ఆప్ ను చిత్తు చేసి ఢిల్లీ పీఠం చేజిక్కించుకున్న కాషాయ దళం
  • విజయోత్సవ సభకు హాజరైన ప్రధాని మోదీ
  • ఢిల్లీ ప్రజలు అభివృద్ది వైపు నిలిచారని వెల్లడి
  • అవినీతిపై పోరాడతామన్న వారే అవినీతిలో కూరుకుపోయారని విమర్శలు

గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్లీ పాగా వేసింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారని అన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి చూడొచ్చని పేర్కొన్నారు. పనితీరు ఆధారంగానే అనేక రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీకే అధికారం ఇస్తున్నారని తెలిపారు. హర్యానాలో సుపరిపాలనకు నాంది పలికామని, మహారాష్ట్ర రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మోదీ చెప్పారు. బీహార్ లో నితీశ్ కుమార్ కూడా ఎన్డీయేపై విశ్వాసం ఉంచారని, ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారని వివరించారు. 

బీజేపీ పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని స్పష్టం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే తప్పకుండా పూర్తయ్యే గ్యారెంటీ అని ఉద్ఘాటించారు. 

“ఢిల్లీని వాతావరణ కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమే అధికారంలో ఉంది. ఎన్డీయే పాలిత రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీలో పాలన ఎంత అధ్వానంగా ఉందో అందరూ చూశారు. అవినీతిపై పోరాడతామన్న వారే అవినీతిలో కూరుకుపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎన్నో సంవత్సరాల పాటు పోరాడారు. ఇవాళ ఆ అవినీతి పార్టీ ఓటమిపై అన్నా హజారే కూడా సంతోషిస్తున్నారు. 

అభివృద్ధి వైపే ఉంటామని ఢిల్లీ ప్రజలు ఓటుతో ఘనమైన తీర్పు ఇచ్చారు. యమునా నది మనందరికీ పూజ్యనీయమైన నది. కానీ, ఆ నది పరిశుభ్రతను నిర్లక్ష్యం చేశారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న యమునా నదిని మేం ప్రక్షాళన చేస్తాం. యమునా నది పవిత్రతను కాపాడతాం. ఇది మోదీ గ్యారెంటీ” అంటూ ప్రసంగించారు. 

ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ పార్టీపైనా స్పందించారు. ఢిల్లీలో వరుసగా 6 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని ఎద్దేవా చేశారు. సున్నా సీట్లతో రెండు పర్యాయాలు హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని వ్యంగ్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతలను అర్బన్ నక్సల్స్ తో పోల్చారు. కాంగ్రెస్ నేతలు అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాల్లో వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టడమే కాంగ్రెస్ పని అని మండిపడ్డారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం…ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం దిశగా సాగుతోంది. 27 ఏళ్లుగా ఢిల్లీ పీఠం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ… ఈసారి అనుకున్నది సాధిస్తోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం ద్వారా కాషాయదళం ఢిల్లీ గద్దెనెక్కబోతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మానవశక్తిని మించింది లేదు అంటూ బీజేపీ శ్రేణుల కృషిని కొనియాడారు. అభివృద్ధి గెలిచింది… సుపరిపాలన నెగ్గింది అంటూ ట్వీట్ చేశారు. 

“బీజేపీకి చారిత్రాత్మక విజయం అందించిన ఢిల్లీ సోదర సోదరీమణులందరికీ అభివందనాలు, శుభాకాంక్షలు. ఎనలేని ఆశీస్సులు, అపారమైన ప్రేమ అందించిన మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి ఢిల్లీ సమగ్రాభివృద్ధికి పాటుపడతాం. ఏ ఒక్క అంశాన్ని కూడా విస్మరించకుండా ఢిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచే కార్యక్రమంలో ఢిల్లీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని హామీ ఇస్తున్నాను. 

ఇంతటి భారీ ప్రజా తీర్పుకు బీజేపీ కార్యకర్తలే కారణం. నా బీజేపీ కార్యకర్తలు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించి ఈ విజయం అందించడం పట్ల గర్విస్తున్నాను. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు మరింత దృఢంగా అంకితమవుతాం” అని ప్రధాని మోదీ తన ట్వీట్ లో వివరించారు.

Related posts

విపక్ష నేతలపై కేసులు పెడుతున్న మోడీ , కేసీఆర్ , ఎంఐఎం పై ఎందుకు పెట్టడంలేదు ..

Ram Narayana

ధన్ ఖడ్ రాజీనామా వెనక ఇంత కథ ఉందా…?

Ram Narayana

ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ ఓట్ల చోరీ.. బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్!

Ram Narayana