స్థానిక సంస్థల్లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి.
` -సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
కుల గణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా కమిటి, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయటం వలన ఉపయోగం ఉండదన్నారు. చట్టం చేయటం ద్వారానే బిసి లకు న్యాయం జరుగుతుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం కుల గణనను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. బిసిలకు అన్యాయం చేస్తున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమన్నారు. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కలు, కుల గణన చేపట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. బిజెపి నాయకులు ఇక్కడ బిసిల గురించి మొసలి కన్నీరు కార్చటం కాదు, బిసిలపై నిజంగా ప్రేమ ఉంటే నరేంద్ర మోడీని ఒప్పించి దేశవ్యాపితంగా కుల గణన చేపట్టాలని ఆయన సవాల్ చేశారు.
పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మిర్చి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, క్వింటాల్‌కు కనీసం 25 వేల రూ.లు ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం వచ్చే బడ్జెట్‌లో తగిన విధంగా నిధులు కేటాయించాలన్నారు. బడ్జెట్‌లో నిధులు యివ్వకుంటే ప్రభుత్వానికి నిరసనలు తప్పవన్నారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, వై.విక్రమ్, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, డివిజన్ కార్యదర్శులు మడుపల్లి గోపాల్‌రావు, శీలం సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.