రాష్ట్రాభివృద్ధికి సైంధవుల్లా అడ్డుపడుతున్న కేసీఆర్ ,కిషన్ రెడ్డి …సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ …
మెట్రో విస్తరణ ,ట్రిపుల్ ఆర్ రాష్ట్రానికి రాలసిన ప్రాజెక్టులు అడ్డుకుంటున్నది ఎవరు …
రాష్ట్రంలో మంచిని కిషన్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా
పాలమూరు ద్రోహి కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి
మేము 55 వేల ఉద్యోగాలు ఇస్తే …రాష్ట్రంలో మోడీ సర్కార్ ఇద్దరికీ కొలువులు ఇచ్చింది
రాష్ట్రాభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్ సహా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల్ని కిషన్‌రెడ్డి అడ్డుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత వనపర్తిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాను చదువుకున్న రోజుల్లో 12 ఏళ్లు అద్దెకు ఉన్న ఇంటిని రేవంత్ రెడ్డి సందర్శించారు. తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం, వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాఠశాల మిత్రులతో సమావేశమయ్యారు. అనంతరం వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెప్స్ బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అనంతరం వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన ప్రజా పాలన – ప్రగతి బాట బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేదాకా విశ్రమించేది లేదని తెగేసి చెప్పారు. కృష్ణా జలాలు ఏపీ తరలించుకుపోతున్నా ప్రేక్షక పాత్రకు పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ కచ్చితంగా పాలమూరు ద్రోహి అని మండిపడ్డారు. నాడు కృష్ణాజలాల ఒప్పందంపై కేసీఆర్ పెట్టిన సంతకమే, పాలమూరు వాసులకు మరణశాసనంలా మారిందని విమర్శించారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. పదేళ్లు ఎస్ఎల్బీసీ పనులు చేయకపోవడం వల్లే టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా కిషన్ రెడ్డి బీజేపీ ఖాతాలో వేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు, మూసీ ప్రక్షాళనకు నిధులు తేవడంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదని నిలదీశారు. ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు తాము ఇస్తే, మోదీ సర్కార్ రాష్ట్రంలో ఇద్దరికే కొలువులిచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంతో మాట్లాడి ఎందుకు సాధించడం లేదని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. యువతకు స్వయం ఉపాధి కల్పనకు 6 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లోకి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

- ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం
- 8 మంది గల్లంతు… ఇప్పటికీ తెలియరాని ఆచూకీ
- గత 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోగా, నేటికి 9వ రోజు కూడా వారి ఆచూకీ తెలియరాలేదు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోకి వెళ్లి సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం టన్నెల్ వద్ద అధికారులతో సమావేశం అయ్యారు. సహాయక చర్యలపై సమీక్ష చేపట్టారు. గత 9 రోజులుగా సహాయక చర్యలు జరుగుతున్న తీరును అధికారులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మృతదేహాలు బయటికి తీసుకువచ్చే వరకు పనులు ఆపొద్దని సూచించారు. రెస్క్యూ టీమ్ లకు అధికారులు అన్ని విధాలుగా సహకరించాలని నిర్దేశించారు. కాగా, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఇది ఒక విపత్తు… అందరం సానుభూతి ప్రకటించాల్సిన సమయం: సీఎం రేవంత్ రెడ్డి

- ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం… 8 మంది గల్లంతు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- నేడు టన్నెల్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇది ఒక విపత్తు… అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన సమయం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను హెలికాప్టర్ లో హుటాహుటీన అక్కడికి పంపానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి నిమిషం సమీక్షిస్తూనే ఉన్నానని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని తెలిపారు. సహాయక చర్యల్లో 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు పాలుపంచుకుంటున్నాయని వివరించారు.
కాగా, గతంలో దేవాదుల వద్ద ప్రమాదం జరిగితే తొమ్మిదేళ్లయినా ఆ ఐదుగురి మృతదేహాలు లభ్యం కాలేదని రేవంత్ రెడ్డి వివరించారు.
“ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మరి హరీశ్ రావు దుబాయ్ వెళ్లి రెండ్రోజులు ఎంజాయ్ చేయలేదా? హరీశ్ రావు ప్రయాణ వివరాలు తీయండి… దుబాయ్ వెళ్లాడో, లేదో తెలుస్తుంది” అని అన్నారు.