- స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం
- ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్
- తొలుత ప్రయోగాత్మకంగా 22 కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్
తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ప్రారంభంలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.
పత్రాల రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానున్నట్లు ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరళతరం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు సమర్థవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తీసుకురాబోతోంది. రాష్ట్రంలో 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
నేరుగా విచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు… హైదరాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్‌నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్‌నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం, మేడ్చల్, మహబూబ్‌నగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ గ్రామీణం, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్‌కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్యక్రమానికి తాము శ్రీకారం చుడుతున్నామని తెలిపారు సబ్-రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యం నివారించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజువారీ పని వేళలను 48 స్లాట్లుగా విభజించడం జరిగిందన్నారు. ప్రజలు నేరుగా registration.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్దేశించిన సమయానికి నేరుగా విచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చని సూచించారు. స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో ఆ దస్తావేజులు స్వీకరిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు.