- బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి ఖమ్మం నేతల కసరత్తు
- వాహనాలు, భోజనం, తాగు నీటి ఏర్పాట్లకు ఇంచార్జిల నియామకం
- ఈ నెల 25న మండల కేంద్రాల్లో, 27న గ్రామాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణ
- పార్టీ గద్దెలు లేని గ్రామాల్లో కొత్తగా గద్దెలు నిర్మించాలని తీర్మానం
- సమావేశానికి హాజరైన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాతా మధు

ఈనెల 27వ తేదీన వరంగల్లులో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నేతలు ప్రణాళికను సిద్ధం చేశారు. సభను విజయవంతం చేసేందుకు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన పార్టీ కీలక నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, కొండబాల కోటేశ్వర రావు, వనమా వెంకటేశ్వర రావు, మెచ్చా నాగేశ్వర రావు, బానోతు హరిప్రియ నాయక్, బానోత్ మదన్ లాల్, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ జన సమీకరణ, ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. వాహనాలు, భోజన, తాగు నీటి ఏర్పాట్లకు ఇంచార్జిలను నియమించారు. బహిరంగ సభకు వెళ్ళేందుకు రూట్ మ్యాప్, పార్కింగ్ తదితర అంశాలపై కులంకషంగా చర్చించారు. అంతే కాకుండా పార్టీ రజతోత్సవ బహిరంగ సభను పురష్కరించుకొని ఈనెల 25న జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని నిర్ణయించారు. గ్రామాలలో ఇప్పటికే ఉన్న పార్టీ గద్దెలకు ముస్తాబు చేయడంతో పాటు గద్దెల లేని గ్రామాలలో నూతనంగా గద్దెలు నిర్మించాలని తీర్మానించారు. అదే విధంగా 27న ఉదయం అన్ని గ్రామాలలో పార్టీ జెండాలు ఆవిష్కరించి, ఆ తర్వాత ఎవరికి కేటాయించిన వాహనాల్లో వారు వరంగల్లు సభకు బయలు దేరి వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఉప్పల వెంకట రమణ, భద్రాద్రి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, ముత్యాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.