ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు ప్రారంభించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ ) కు కీలక ఆధారం లభించింది. ఈ దర్యాప్తులో బైసారన్ ప్రాంతంలో పర్యాటకుల కోసం రీల్స్ చిత్రీకరించిన స్థానిక వీడియోగ్రాఫర్ కీలక సాక్షిగా నిలిచాడు. ఉగ్రవాద దాడి జరిగిన సమయంలో, స్థానిక ఫోటోగ్రాఫర్ దృశ్యాలను చిత్రీకరించాడని అధికారులు తెలిపారు. “కాల్పులు ప్రారంభమైనప్పుడు, ఈ ఫోటోగ్రాఫర్ తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరిగెత్తాడు. బుల్లెట్ల నుండి తప్పించుకునేందుకు చెట్టుపై కూర్చున్నాడు. కానీ, దానితో పాటు సంఘటన జరుగుతున్నప్పుడు వీడియో తీస్తూ ఉన్నాడు, మొత్తం ఉగ్రవాద దాడిని రికార్డ్ చేశాడు” అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఎన్ఐఏ ఈ వీడియోగ్రాఫర్‌ను ప్రశ్నించి, అతను చిత్రీకరించిన వీడియోలను విశ్లేషిస్తోంది. ఈ వీడియోల ద్వారా ఉగ్రవాదులను, వారికీ సహాయం చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.