పారిశుధ్య కార్మికుల మరణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాన్ హోల్స్ శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్పష్టం చేసింది. 1993 నుంచి ఇప్పటి వరకు మురుగు గదులు శుభ్రం చేస్తూ చని పోయిన వారందరి వివరాలను సేకరించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది. విజయవాడలో డ్రైనేజీ శుభ్రం చేస్తూ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మురుగు నీరు చేతితో శుభ్రం చేయిస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగి దాలయ్య వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. “మాన్యువల్ స్కావెంజింగ్ నిషేధ చట్టం–2013” ఉల్లంఘించబడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఉన్న ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వం, పురపాలక శాఖలను ఉద్దేశించి అనేక కీలక సూచనలు చేసింది.
next post