రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్రల అంశంపై చర్చ జరుగుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. 2027లో పాదయాత్ర చేపట్టనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడంపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సెటైర్లు వేశారు. పాదయాత్ర చేస్తే ఆయన ఆరోగ్యానికి మంచిదేనని వ్యాఖ్యానించారు. పాదయాత్రే కాదు, పరిగెత్తే యాత్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను అడ్డగోలుగా దోచుకుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
భద్రాచలం ఆలయ భూముల అంశాన్ని కూడా ఈ సందర్భంగా రేణుకా చౌదరి ప్రస్తావించారు. ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల్లోనే ఈ ఆలయ భూములు ఉన్నాయని, వాటిని తిరిగి తెలంగాణలో కలపాలని ఆమె కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆమె సూచించారు.
రాజ్యసభలో అమరావతిని ఉద్దేశించి తాను చేసిన ‘కమరావతి’ వ్యాఖ్యలపై చెలరేగిన దుమారానికి ఆమె వివరణ ఇచ్చారు. “గతంలో జగన్ అమరావతిని వ్యంగ్యంగా ‘కమరావతి’ అని పిలిచారు. నేను కేవలం ఆయన అన్న మాటలనే సభలో గుర్తు చేశాను తప్ప, నా సొంతంగా అన్నవి కావు” అని ఆమె స్పష్టం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: