
- సమ్మెకు వెళ్లవద్దని కార్మిక సంఘాలకు మంత్రి సూచన
- ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడి
- గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శ
- కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ, నియామక చర్యల వెల్లడి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు సూచించారు. హైదరాబాద్‌లో పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ ఇబ్బందులను, డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వినడానికి ముఖ్యమంత్రితో పాటు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని పునరుద్ఘాటించారు. ఆర్టీసీ క్రమంగా నష్టాల నుంచి గట్టెక్కుతోందని, సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని మంత్రి వివరించారు. ఇలాంటి కీలక సమయంలో సిబ్బంది సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, సంస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.
గత పదేళ్ల పాలనలో మునుపటి ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని పొన్నం విమర్శించారు. ఆ కాలంలో ఒక్క కొత్త బస్సు కొనలేదని, ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా, ఉద్యోగులకు చెందిన సీసీఎస్, పీఎఫ్ నిధులను కూడా అప్పటి ప్రభుత్వం వాడుకుందని ఆయన తెలిపారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులకు బాండ్ రూపంలో రూ.400 కోట్లు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిలు రూ.1,039 కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ.345 కోట్లు చెల్లించామని మంత్రి గుర్తు చేశారు. వీటితో పాటు 1,500 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశామని, కొత్తగా మరో 3,038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని కార్మిక సంఘాల నేతలకు వివరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సహకరించాలని ఆయన కోరారు.
ఈ నెల 7న సమ్మె.. హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ నిరసన ర్యాలీ

- హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల కవాతు
- చర్చలకు పిలవలేదంటూ జేఏసీ ఆగ్రహం
- ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు కవాతు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) సమ్మెకు సిద్ధమవుతోంది. ఈ నెల 7వ తేదీన తలపెట్టిన సమ్మెకు సన్నాహకంగా కార్మికులు సోమవారం హైదరాబాద్‌లో భారీ కవాతు నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు బస్ భవన్ వరకు కొనసాగింది. ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ వెంకన్న ఈ సందర్భంగా తెలిపారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాకపోవడంతో అనివార్యంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు చర్చలకు ఆహ్వానించలేదని, అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు. కవాతు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవాతు సాగిన మార్గంలోనూ, బస్ భవన్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.