శాంతి చర్చలకు మోడీ ప్రభుత్వం సిద్ధమా ..?కదా ?స్పష్టం చేయాలన్న మావోయిస్టు పార్టీ ..!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుదీర్ఘలేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ
శాంతి చర్చలకు ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రావాలని ప్రజాస్వామ్య వాదులకు విజ్ఞప్తి …
పార్టీ తరుపున అభయ్ పేరుతో లేఖ విడుదల
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్రం తీసుకున్న చర్యల నేపథ్యంలో ఆపరేషన్ కగారు పేరోతో ఛత్తీస్ ఘడ్ లోని మావోయిస్టులకు పట్టున్న అభుజ్ మడ్ ప్రాంతంలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి …28 మంది మావోయిస్టులు చనిపోయారు .. అయితే ఇటీవల భారత్ -పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా దళాలను కేంద్రప్రభుత్వం వెనక్కు పంపింది .. కర్రెగుట్టల్లో ఆపరేషన్ కొంత వరకు తగ్గినా కొనసాగుతూనే ఉంది …కర్రెగుట్టల ఆపరేషన్ పేరుతో జరుగుతున్న చర్యలను ఆపాలని ఇప్పటికే ప్రజాస్వామిక వాదులు ,ప్రజాసంఘాలు , రాజకీయ పార్టీలు సభలు సమావేశాల పేరుతో నినాదిస్తున్నాయి..చివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,ప్రతిపక్ష బీఆర్ యస్ , కమ్యూనిస్టు పార్టీలు చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నాయి …మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు తాము సిద్ధమని అభయ్ పేరుతో మరో లేఖను విడుదల చేసింది ….
లేఖ యధాతధంగా ఈ విధంగా ఉంది …
శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమే!
గౌరవనీయులైన మోదీ గారి ప్రభుత్వం ఇందుకు సుముఖమా, కాదా, స్పష్టం చేయాలి!
ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రండి!
భారతదేశవాసులకు, ప్రజాస్వామికవాదులకు, శాంతికాములకు, అంతర్జాతీయ విప్లవ, ప్రజాస్వామిక శక్తులకు మా పార్టీ విజ్ఞప్తి! మా పార్టీ కేంద్రకమిటీ తరఫున నేను ప్రజా సమస్యల పరిష్కారానికి సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి, శాంతి చర్చలు జరపాల్సిందిగా ఏప్రిల్ 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ 2వ ప్రకటన విడుదల చేసాను. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే అనుకూలంగా ప్రతిస్పందించడం ఆహ్వానించదగిన అంశం. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గానీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గానీ వచ్చిన వ్యతిరేక ప్రతిస్పందన చింతనీయంగా ఉంది. కాల్పుల విరమణ ప్రసక్తే లేదనీ, మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టకుండా వారితో శాంతి చర్చలు జరిపే అవకాశం లేదని కేంద్ర హోంశాంఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ గారు, ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి-రాష్ట్ర హోంమంత్రి గౌరవనీయులు విజయ్ శర్మ గారు ప్రకటించారు. ఎటువంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్దమని విజయ్ శర్మ గారు పదే పదే చేసిన ప్రకటనలకు భిన్నంగా కాల్పుల విరమణ ప్రకటించకుండానే మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టాలని షరతు పెట్టారు. నిజానికి మా పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లకు పరిమితమైలేదు. దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో మా పార్టీ పని చేస్తోంది. అందువల్ల శాంతి చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు ప్రతిస్పందించాల్సి వుంది. ఆయన ప్రతిస్పందిస్తే ఉపయోగం ఉంటుంది. మా పార్టీ 2002 నుంచే శాంతి చర్చల పట్ల తన వైఖరిని ప్రకటిస్తూ వచ్చింది. 2004లో ప్రజల, ప్రజాస్వామికవాదుల డిమాండ్ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీతో చర్చలు జరిపినప్పటికీ వాటిని చివరి వరకు కొనసాగించకుండా చర్చల నుంచి ఏకపక్షంగా వైదొలిగింది. ఆనాడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైంది. కానీ 2010లో దేశంలోని పౌరసమాజం, ప్రజాస్వామికవాదుల విజ్ఞప్తి మేరకు మా పార్టీ కేంద్రకమిటీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి చర్చల కోసం కృషి చేస్తున్న మా పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ ఆజాద్ ను కుట్రపూరితంగా పట్టుకుని హత్య చేసింది. ఈ చర్చల ప్రక్రియలో భాగంగానే పశ్చిమ బెంగాల్ లో మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రాంజీ (మల్లో ల కోటేశ్వర్లు)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేసాయి. శాంతి చర్చల ప్రక్రియను భగ్నం చేసాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు శాంతి చర్చల విషయంలో మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. మా పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్నడూ అలాంటి ప్రయత్నాలు చేయలేకపోవడం చింతనీయం. నేడు ఆపరేషన్ కగార్ లో మా పార్టీ నాయకత్వం-కేడర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసుల్ని హత్య చేయడమే కాకుండా మా పార్టీకీ, ఆదివాసుల అస్తిత్వానికి పెనుసవాలు ఎదురైన మాట వాస్తవమే. కానీ ఇందువల్లనే మా పార్టీ శాంతి చర్చలపై పత్రికా ప్రకటనలు గుప్పిస్తోందని గోదీ మీడియా చేస్తున్న విష ప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం లేదు. బాధ్యత కలిగిన ఈ దేశవాసుల నుంచి వచ్చిన ప్రస్తావనను మేము హృదయపూర్వకంగా స్వీకరిస్తూ, వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి నేను ఒక మెసేజ్ పంపాను. దానినే వారు పత్రిక ప్రకటనగా విడుదల చేసారు. అదే మార్చి 28న (2025) విడుదలైన పత్రికా ప్రకటన. తెలంగాణలో ప్రత్యేకించి అనేక వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, శాంతికాముకులు సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిపై అర్బన్ నక్సల్స్ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సరైంది కాదు. తెలంగాణ ప్రభుత్వానికి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉండడం వలన శాంతి చర్చల గురించి ముందు నుంచి తెలిసి వుండడం వలన శాంతి చర్చల ప్రస్తావనకు వెంటనే అనుకూలంగా స్పందించింది. కాల్పులు విరమించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసారు. కాకతాళీయంగా అదే సమయంలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి (బీ.ఆర్.ఎస్.) రజతోత్సవ సభలకు హాజరైన లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా మావోయిస్టులతో చర్చల జరపాలని ప్రజలు నినదించారు. నేడు దేశంలో లక్షలాది మంది ప్రజలు శాంతి చర్చలను కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో వివిధ మావోయిస్టు పార్టీల, ప్రజాస్వామిక సంస్థలతో పాటు కార్మికులు, రైతాంగం, మధ్యతరగతి ప్రజలు కూడా మన దేశంలో మావోయిస్టులతో గౌరవనీయులైన మోదీ గారి ప్రభుత్వం శాంతి 1 α Scanned with OKEN Scanner చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేను ఏప్రిల్ 25న రెండవ ప్రకటన విడుదల చేసాను. శాంతి చర్చలకు నేను విడుదల చేసిన ప్రకటనలను మా పార్టీ బలహీనతగా గోదీ మీడియా విష ప్రచారం చేయడం వారి కార్పొరేట్ స్వభావాన్నే మరోసారి బహిర్గతం చేసింది తప్ప మరొకటి కాదు. ఇకపోతే, నా 2వ ప్రకటనకు ప్రతిస్పందనగా గౌరవనీయులు బండి సంజయ్, విజయ్ శర్మల ప్రతిస్పందనలో మాట్లాడిన విషయాలు చింతనీయం. వాటిలో ఏమాత్రం వాస్తవాలు లేవు. రాజ్యహింసకు ప్రతిస్పందనగానే మా పార్టీ సాయుధ పోరాటానికి దిగిందనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను, ఆదివాసీ గైరాదివాసీ ప్రజలను వందలాది మందిని హత్య చేసింది, చేస్తోంది. మే 7వ తేదీన కర్రెగుట్టల్లో ప్రభుత్వ సాయుధ బలగాలు పాశవికంగా నిర్వహించిన హత్యాకాండలో 22 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. దీంతో కర్రెగుట్టల ఆపరేషన్ లో అమరులైనవారి మా కామ్రేడ్స్ సంఖ్య 26కు చేరుకుంది. ఒక వైపు చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ విధంగా హత్యాకాండ కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా దేశవాసులకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి తుపాకులు పట్టుకునే వారిని కాల్చిచంపే అధికారాన్ని ఏ చట్టమూ ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ వాస్తవాన్ని వారు కప్పిపెట్టేందుకు, సత్యాన్ని తలకిందులు చేసేందుకు పడరాని పాట్లు ఎందుకు పడుతున్నారో వారికే తెలియాలి, కానీ ఇందులో వారు ఎన్నడూ సఫలం కాలేరు. ఇక మేము ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసే విషయానికి వస్తే – ఈ విషయంపై మా పార్టీలో ఏ ఒక్కరో నిర్ణయం తీసుకోలేరు. మా పార్టీ ప్రజాస్వామికంగా పని చేసే పార్టీ. ఆపరేషన్ కగార్ లో లక్షలాది మంది పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు మా ఉద్యమ ప్రాంతాలను చుట్టిముట్టి వున్న స్థితిలో మా పార్టీలో కనీసం కోర్ అయినా సమావేశమై ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోతోంది. అందువల్లనే సమయావధితో కూడిన కాల్పుల విరమణను నేను ప్రతిపాదించాను. ప్రజలకు గానీ, మా పార్టీ కేడర్లకు గానీ రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చలకు రావడం అసాధ్యమని పేర్కొన్నాను. కనుక రెండు పక్షాల నుంచి కాల్పుల విరమణ ప్రకటిస్తే మా పార్టీ కేంద్ర నాయకత్వం/కోర్ కలుసుకుని చర్చించుకుని, అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకుని ఇప్పటికైనా సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి మా పార్టీతో శాంతి చర్చలకు అంగీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయాన్ని మా పార్టీ దండకారణ్య ఉత్తర్-పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జ్ కామ్రేడ్ రూపేష్ పత్రికా ప్రకటనల ద్వారా, లెటర్స్ ద్వారా ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ గారికి తెలియజేసాడు. వీటిపై ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బ్రీఫింగ్ చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఏవిధంగానైనా మా పార్టీని మార్చి 31, 2026 నాటికి నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ ను గౌరవనీయులైన మోదీ గారి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అయితే ఈ లక్ష్యాన్ని అది సాధించడం అసాధ్యమని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాను. కాల్పులు విరమణ చేస్తే మావోయిస్టుల బలపడతారని గౌరవనీయులైన మోదీ గారి ప్రభుత్వం, గోదీ మీడియా ప్రచారం చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదు. ఏ దేశంలోనయినా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే విప్లవకారులు బలపడేందుకు పునాది కల్పిస్తాయి. సమాజంలో భూమి సమస్య, ఆకలి, పేదరికం, సామాజిక ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, మహిళ సమస్య, దళిత సమస్య (అంటరానితనం), కుల సమస్య, జాతుల సమస్య తదితర మౌలిక సమస్యలున్నంత వరకూ ఈ పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే విప్లవకారులు బలపడే అవకాశముండదు. మా పార్టీ ముందుకు తెచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే శాంతి చర్చలు జరపి, సమస్యలకు సరైన పరిష్కారాలను కనుగొని ఒక ఒప్పందానికి వస్తే విప్లవోద్యమ ప్రాంతాల్లో రాజ్యహింసకు, మా సాయుధ పోరాటానికి పునాది లేకుండా పోతుంది. శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి గౌరవనీయులైన మోదీ గారి ప్రభుత్వం సముఖమా, కాదా, స్పష్టం చేయాలి. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా గౌరవనీయులైన మోదీ గారి ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రావాల్సిందిగా భారతదేశవాసులకు, విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామికవాదులకు, శాంతికాముకులకు జర్నలిస్టులకు, సామాజిక సంస్థలకు, కార్యకర్తలకు, ఆదివాసీ శ్రేయోభిలాషులకు, అంతర్జాతీయ విప్లవ, ప్రజాస్వామిక శక్తులకు మా పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. అని పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది …