- ఈసీ కార్యాలయానికి కూటమి ఎంపీల ర్యాలీ
- అడ్డుకున్న పోలీసులు.. ఖర్గే, అఖిలేశ్ యాదవ్ సహా పలువురి అరెస్ట్
- ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా పలువురు కీలక నేతలను అరెస్టు చేశారు. ప్రత్యేక బస్సుల్లో వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది.
లోక్ సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచేందుకు ఈ రోజు విపక్ష కూటమి ఎంపీలంతా ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి మార్చ్ నిర్వహించేందుకు తలపెట్టగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
సంసద్ మార్గ్‌ను బ్లాక్ చేశారు. భేటీకి 30 మందికి అనుమతిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించగా.. అందరం కలిసే వెళతామని ఇండియా కూటమి ఎంపీలు పట్టుబట్టారు. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లు ఎక్కి అవతలకు దూకి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇండియా కూటమి ర్యాలీలో ప్రత్యక్షమైన శశిథరూర్

- కొంత కాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా ఉన్న శశిథరూర్
- నేడు ఎలెక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ర్యాలీ
- ర్యాలీలో పాల్గొన్న ఇండియా కూటమి ఎంపీలు
ఎలెక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ నుంచి ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో విపక్ష ఎంపీలు కేంద్రానికి, ఈసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేదంటూ బ్యారికేడ్లు అడ్డు పెట్టారు. దీంతో పోలీసులతో ఎంపీలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, పలువురు మహిళా ఎంపీలు బ్యారికేడ్లు దూకేందుకు యత్నించారు.
మరోవైపు, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అనూహ్యంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొంత కాలంగా శశిథరూర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ర్యాలీలో ఆయన పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.