వాజ్‌పేయి ప్రభుత్వం కూడా రాజ్యాంగ పునఃసమీక్ష కమిటీ వేసింది: ‘రాజ్యాంగ మార్పు’ విమర్శలపై వినోద్ కుమార్
- రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపట్లేదు
- ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్
- అంబేడ్కర్ కల్పించిన హక్కులకు అన్యాయం జరుగుతోందన్న వినోద్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… నదుల అనుసంధానం అంటోన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో ఆ విషయంపై ఎందుకు చర్చ జరపలేదని నిలదీశారు.
ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగం మొదటి ఆర్టికల్‌లోనే ఉందని ఆయన చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వరా? అని ఆయన నిలదీశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకే కేంద్ర బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించారని ఆయన ఆరోపించారు. అంబేడ్కర్ కల్పించిన హక్కులకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
వాజ్‌పేయి ప్రభుత్వం గతంలోనే రాజ్యాంగ పునఃసమీక్ష కమిటీని వేశారని, దానికి జస్టిస్ వెంకటాచలయ్య అధ్యక్షత వహించారని వినోద్ కుమార్ అన్నారు. అంతకు ముందు కూడా ఇదే విషయంపై ప్రభుత్వాలు కమిటీలు వేశాయని చెప్పారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు సరికాదని అన్నారు.