కేటీఆర్ గారు ఆదుకోవాల్సింది పోయి గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు చేస్తున్నారు: షర్మిల
- చిన్న దొర గారి సొంత నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య
- అప్పులపాలై చేనేత కుటుంబం కూడా ఆత్మహత్య
- అయ్యో అనడానికి నోరు మెదపటం లేదు
- సాయమందించటానికి చెయ్యి రావటం లేదు
తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడున్నా పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపించారు.
”చిన్న దొర గారి సొంత నియోజకవర్గంలో అప్పులపాలైన రైతు ఆత్మహత్య చేసుకుండు. చేనేత మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పులపాలై చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేటీఆర్ గారు ఆదుకోవాల్సింది పోయి గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు చేస్తున్నారు.
తప్పితే అయ్యో అనడానికి నోరు మెదపటం లేదు. సాయమందించటానికి చెయ్యి రావటం లేదు. పంట పెట్టుబడికి అప్పు తెచ్చి, సాగు నీటి కోసం బోర్ల మీద బోర్లు వేసి చుక్క నీళ్లు పడక, కండ్ల నుంచి నీటి ధార ఆగక తెచ్చిన అప్పులు తీర్చలేక గోవర్ధన్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే, చేనేత మగ్గం నడువక, బతుకు బండి సాగక బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక చేనేత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం భారమైపోయింది. నేతన్నల కష్టానికి ఫలితం కరవైంది. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోని పెద్ద దొర తెలంగాణ బిడ్డలను గాలికొదిలేస్తున్నారు” అని షర్మిల ఆరోపించారు.