Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు 

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…. ‘‘ తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి వున్నవి. డా. బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తున్నది.

అంబేద్కర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నది. ఫెడరల్ స్పూర్తి ని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్పూర్తి మమ్మల్ని నడిపిస్తున్నది. భారత దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.

భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదు. భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నాం. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది కూడా. ఇదే విషయమై నేను భారత ప్రధానికి త్వరలో స్వయంగా లెటర్ కూడా రాసి పంపుతాను. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును పెట్టాలని నీను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాను.”

Related posts

Build Muscle By Making This Simple Tweak to Your Training Program

Drukpadam

రూ.1.5 లక్షల బ్యాగుతో చెట్టెక్కిన కోతి! ఆ తరువాత..

Drukpadam

16 ఏళ్ల‌కే ముస్లిం యువ‌తులు పెళ్లి చేసుకోవ‌చ్చు…పంజాబ్‌, హ‌ర్యానా కోర్టు సంచ‌ల‌న తీర్పు!

Drukpadam

Leave a Comment