NTV, CVR ఛానల్స్ ఛైర్మన్లు సహా… ఐదుగురి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిన జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ…
నేడు జరిగిన జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వ సభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సొసైటీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పలు అక్రమాలకు పాల్పడిన ఐదుగురు సొసైటీ సభ్యులను తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యాక్ట్ సెక్షన్ 21 ప్రకారం ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాలని .. సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానం మేరకు టి.నరేంద్ర చౌదరి (ఎన్‌టీవీ ఛైర్మన్), సీవీ రావు, టి. హనుమంతరావు, ఏ. మురళి ముకుంద్, కిలారీ రాజేశ్వర్ రావు ప్రాథమిక సభ్యత్వాలు కోల్పోయారు.
అనర్హత వేటుకు గురైన ఈ ఐదుగురు సభ్యులు జూబ్లీహిల్స్ క్లబ్ సభ్యత్వం కూడా కోల్పోయినట్లేనని సొసైటీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 30 ఏళ్లలో తొలిసారిగా ఈ సర్వ సభ్య సమావేశానికి రికార్డు స్థాయిలో 750 మందికి పైగా సభ్యులు హాజరైనట్లు సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. సొసైటీ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అతి తక్కువ ఖర్చుతో చేపట్టి .. స్మార్ట్ సొసైటీగా తీర్చిదిద్దేందుకు నాస్కామ్ సహకారంతో పలు ఐటీ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. దీనితో సభ్యులకు సంబంధించిన సమాచారం టాంపరింగ్ కానీ, మిస్ ప్లేస్ అవకుండా భద్రంగా ఉంటుందని రవీంద్రనాథ్ తెలిపారు. అలాగే సొసైటీ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తామని వెల్లడించారు. సభ్యుల అత్యవసర అవసరాల కోసం ఆంబులెన్స్ సైతం అందుబాటులోకి తెచ్చామని .. ఆరోగ్య పరీక్షలు సైతం ఇంటి దగ్గరే నిర్వహించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కేవైసీ డ్యాకుమెంట్స్ సమర్పించిన సభ్యులకు స్మార్ట్ కార్డులను అందించారు. లారస్ ల్యాబ్స్ ఛైర్మన్ సి.సత్యనారాయణ అంబులెన్స్‌ను సొసైటీకి బహుమతిగా ఇచ్చారు.