ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ పై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు!
-కేసుల ఉపసంహరణ వ్యవహారంలో వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం
-కేసుల ఉపసంహరణకు సంబంధించి 9 జీవోలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
-వాటన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది
-తదుపరి విచారణ వచ్చే నెల 13కు వాయిదా
ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ విషయంలో ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది.అంతకుముందు ఉన్న కేసులను జగన్ సర్కార్ 9 జి ఓ లద్వారా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీలు ఎమ్మెల్యేల మీద కేసుల ఉపసంహరణ కుదరదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం తన జి ఓ లను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపింది. వైసీపీ ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకునేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది.
నిన్న హైకోర్టులో జరిగిన విచారణలో హోంశాఖ తరపున హాజరైన ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరర్‌రెడ్డి.. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు సంబంధించి గతంలో జారీ చేసిన 9 జీవోలను ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్టు కోర్టుకు తెలిపారు. కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 13కు కోర్టు వాయిదా వేసింది.
సుప్రీం ఆదేశాలతో కదిలిన ఏపీ హైకోర్టు
దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసి వీలైనంత త్వరగా తీర్పులు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేత అశ్వనీకుమార్ గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం హైకోర్టుల అనుమతి లేకుండా ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్పందించిన ఏపీ హైకోర్టు 16 సెప్టెంబరు 2020 నుంచి 25 ఆగస్టు 2021 మధ్య రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు సంబంధించి ఇచ్చిన జీవోలు, తదితర విషయాలను పరిశీలనకు సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన 9 జీవోలను అందులో ప్రస్తావించింది.
నిందితులు.. హైకోర్టు మధ్య వ్యవహారం కాదు
జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై నమోదైన పది కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇంకోవైపు, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల ఉపసంహరణకు ఆమోదం కోరుతూ ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయిచింది.
ఈ వ్యాజ్యాలన్నీ నిన్న విచారణకు రాగా.. ప్రజాప్రతినిధిపై కేసు పెట్టిన ఫిర్యాదుదారుడి వాదనను వినాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు నోటీసులు జారీ చేద్దామని పేర్కొంది. కేసుల ఉపసంహరణ విషయం నిందితులు, హైకోర్టు మధ్య వ్యవహారం కాదన్న హైకోర్టు.. కేసు తీవ్రత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అది విచారణకు అర్హమైనదా? కాదా? అని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. కేసు ఉపసంహరణకు అనుమతిచ్చేది అంతిమంగా దిగువ కోర్టేనని తేల్చి చెప్పింది.