మాది నేషనల్ పార్టీ… మా జెండాలు పీకుతారా?… విశాఖలో అధికారులపై సోము వీర్రాజు ఫైర్
- విశాఖ వస్తున్న ప్రధాని మోదీ
- జెండాలు ఏర్పాటు చేసిన బీజేపీ
- తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు
- జెండాలను ఎలా తొలగిస్తారన్న వీర్రాజు
ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖ చేరుకోనున్న నేపథ్యంలో, నగరంలోని సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టౌన్ ప్లానింగ్ అధికారులు బీజేపీ జెండాలు తొలగించడాన్ని బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ప్రధానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన జెండాలను ఎలా తొలగిస్తారంటూ సోము వీర్రాజు అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అధికారులు, సోము వీర్రాజు మధ్య వాగ్వాదం నెలకొంది. మీ ఇష్టం వచ్చినట్టు జెండాలు పీకేస్తారా? అంటూ సోము వీర్రాజు మండిపడ్డారు.
ఈ విషయం కమిషనర్ తో మాట్లాడతాను… మేం కట్టిన జెండాలు ఒక్క రోజు కూడా ఉంచరా? అంటూ మండిపడ్డారు. ఓ పికప్ ట్రక్ లో వేసిన బీజేపీ జెండాలను సోము మళ్లీ బయటికి తీశారు.
మాది నేషనల్ పార్టీ… ఇవాళ ప్రధానమంత్రి వస్తున్నారు… జెండాలు ఎందుకు తీసేస్తున్నారు.. మా జెండాలు రెండ్రోజులు ఉంచడానికి మీకు అంత కష్టమైపోయిందా? అంటూ అధికారులపై ఆయన తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు.