జగన్ ఆస్తుల కేసు నుంచి తనను తొలగించాలన్న వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ పై విచారణ…
- హౌసింగ్ ప్రాజెక్టుల చార్జిషీటులో వైవీ పేరు
- ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారన్న వైవీ
- వైవీ సుబ్బారెడ్డి పేరును తొలగించవద్దన్న సీబీఐ
- తీర్పును రిజర్వ్ లో ఉంచిన తెలంగాణ హైకోర్టు
ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసు నుంచి తనను తొలగించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టులో నేడు విచారణకు వచ్చింది. హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలని వైవీ సుబ్బారెడ్డి కోర్టును కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను ఈ కేసులో ఇరికించారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అయితే, సీబీఐ స్పందిస్తూ… వైవీ సుబ్బారెడ్డిని ఈ కేసు నుంచి తొలగించవద్దని తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా, న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి హైదరాబాదులోని పలుచోట్ల 70 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా, గచ్చిబౌలిలో ఇందూ భాగస్వామ్య ప్రాజెక్టు నుంచి 50 శాతం వాటా వైవీ సుబ్బారెడ్డి పేరిట బదిలీ అయిందని సీబీఐ ఆరోపిస్తోంది. అయితే తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడ్ని కావడం వల్లే తన పేరును ఈ వ్యవహారంలో చేర్చారని వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు.