Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సైబర్ నేరగాళ్లకు చిక్కిన 15 వేలమంది భారతీయులు …700 కోట్లు హాంఫట్ ..!

సైబర్ నేరగాళ్లకు చిక్కిన 15 వేలమంది భారతీయులు …700 కోట్లు హాంఫట్ ..!
రూ.700 కోట్ల సైబర్ ఫ్రాడ్ ను బట్టబయలు చేసిన హైదరాబాద్ పోలీసులు!
చైనా సైబర్ నేరగాళ్ల మోసానికి వేలాదిమంది బలి!
దుబాయ్ మీదుగా చైనాకు డబ్బుల తరలింపు
లెబనాన్ ఉగ్రవాద సంస్థకు కొంతమంది వెళ్లినట్లుగా అనుమానాలు
మొదట చిన్న మొత్తంలో పెట్టుబడితో పెద్ద లాభాల ఆశ
ఒక టెక్కినుంచి 28 లక్షలు కొట్టేసిన వైనం ..

తిన్నది లేదు…పెట్టింది లేదు …డబ్బుసంపాదన అత్యాశకు పోయి లబోదిబో మంటున్నారు . ఎంత ప్రచారం జరిపినా ,పోలీసులు అనేక విధాలుగా హెచ్చరికలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త ,కొత్త రూపాల్లో అమాయకులని కాదు తెలివైన వాళ్ళను కూడా ఇట్టే బోల్తా కొట్టిస్తున్నారు . ఇటీవల పెద్ద సైబర్ ఫ్రాడ్ వెలుగు చూసింది. చైనా ఆపరేటర్ల మోసానికి దాదాపు 15,000 మంది భారతీయులు ఒక ఏడాదిలోనే రూ.700 కోట్లకు పైగా నష్టపోయారు. చైనీస్ ఆపరేటర్ల మోసాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు . ఈడబ్బు ఉగ్రవాద సంస్థలకు కూడా చేరడం గమనార్హం….

భారతీయుల నుండి తీసుకున్న డబ్బును దుబాయ్ ద్వారా చైనాకు తరలించారని, అందులో కొంత భాగాన్ని లెబనాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నిర్వహిస్తున్న ఖాతాకు కూడా పంపించారని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి కేంద్ర ఏజెన్సీలకు సమాచారం అందించామని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ క్రైమ్ విభాగానికి వివరాలు అందించామని హైదరాబాద్ పోలీసుల తెలిపారు. అత్యధిక వేతనం తీసుకునే టెక్కీలు కూడా వీరిబారిన పడి అత్యధికంగా రూ.82 లక్షలు కోల్పోవడం ఆశ్చర్యకరంగా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ ఆంగ్ల ఛానల్ తో అన్నారు.

ఇలా దోచుకున్న డబ్బుల్లో కొంత భాగాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి హిజ్బుల్లా నిర్వహించే వాలెట్ లో డిపాజిట్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో హైదరాబాద్ లో నలుగురిని, ముంబైలో ముగ్గురిని, అహ్మదాబాద్ లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

బుట్టలో ఎలా వేశారు …

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ తో రేట్ అండ్ రివ్యూ అంటూ ఓ లింక్ క్లిక్ చేసి తాను మోసపోయినట్లు ఏప్రిల్ నెలలో ఓ బాధితుడు సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.1000 పెట్టుబడితో రూ.25,000 లాభమమని సైబర్ నైరగాళ్లు నమ్మబలికారు. దీంతో సదరు బాధితుడు రూ.28 లక్షలు కోల్పోయాడు. టెలిగ్రామ్, వాట్సాప్ ల ద్వారా సైబర్ నేరగాళ్లు వల వేశారు. దాదాపు 15,000 మంది బాధితులు సగటున రూ. 5-6 లక్షల వరకు కోల్పోయారు.

సైబర్ నేరగాళ్లు మొదట రూ.5,000 చిన్న పెట్టుబడితో రెట్టింపు రాబడిని అందించారు. ఆ తర్వాత ఎక్కువ మొత్తం పెట్టమని చెప్పి, మోసం చేశారు. ఇక్కడ మరో అంశం ఉంది. వీరు పెట్టుబడి పెట్టిన డబ్బుకు రాబడిని ఒక విండోలో చూపించారు. అయితే టాస్క్ అంతా పూర్తి చేసే వరకు ఆ విండోలో వారు పొందిన డబ్బులు కనిపిస్తాయి కానీ వాటిని విత్ డ్రా చేసుకోలేరు. అలా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు.

గత ఏప్రిల్ లో శివ అనే వ్యక్తి తాను రూ.28 లక్షలు మోసపోయినట్లు సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపిన పోలీసులు.. షెల్ కంపెనీలకు చెందిన 48 ఖాతాలను గుర్తించారు. ఆ సమయంలో రూ.584 కోట్ల మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

తదుపరి విచారణలో మోసగాళ్లు మరో రూ.128 కోట్లు స్వాహా చేసినట్లు తేలింది. ఈ కుంభకోణంలో మొత్తం 113 భారతీయ బ్యాంకు ఖాతాలను ఉపయోగించారు. ఆ డబ్బును వివిధ ఖాతాల ద్వారా తరలించారు. కొంత మొత్తాన్ని క్రిప్టో రూపంలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని దుబాయ్ మీదుగా చైనాకు తరలించారు.

భారత సిమ్ కార్డులను ఉపయోగించి ఇక్కడే ప్రారంభించిన ఖాతాలను ఆ తర్వాత రిమోట్ గా దుబాయ్ నుండి ఆపరేట్ చేశారు. కొందరు ఇక్కడి మోసగాళ్లు.. స్కామ్ కు సూత్రధారులైన చైనా ఆపరేటర్లతో సంబంధం కలిగి ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ పేరు మీద, అలాగే నగరానికి చెందిన మునావర్ పేరు మీద ఫోన్లు రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. మునావర్ సహాయకులు.. అరుల్, షా సుమైర్, సమీర్ ఖాన్ లతో కలిసి లక్నోకు వెళ్లాడు. 33 షెల్ కంపెనీల పేరుతో 65 ఖాతాలను తెరిచారు. మునావర్ ఆచూకీ గుర్తించిన పోలీసులు మిగతా వారిని కూడా అరెస్ట్ చేశారు. మనీశ్, వికాస్, రాజేశ్ మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు.

ఈ స్కామ్ వెనకున్న చైనీస్ మాస్టర్ మైండ్స్ కెవిన్ జున్, లీలౌ లాంగ్ జౌ, పాషా 65 ఖాతాలను ఉపయోగించి రూ.128 కోట్లు తరలించారు. ఈ కేసులో అహ్మదాబాద్ కు చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముంబైలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Related posts

హైదరాబాదులో 8 ఏళ్ల బాలుడి దారుణ హత్య..

Drukpadam

కర్ణాటకలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య!

Drukpadam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీడియా అధినేత అరెస్ట్!

Drukpadam

Leave a Comment