- బీజేపీ హయాంలోనే కాదు, కాంగ్రెస్ హయాంలో జరిగిన అంశాలపై కూడా సినిమాలు తీశానని స్పష్టీకరణ
- ఆ సినిమాల గురించి ఎవరూ మాట్లాడటం లేదన్న అక్షయ్ కుమార్
- ప్రధానమంత్రితో ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారన్న అక్షయ్
సినిమాల ద్వారా బీజేపీకి ప్రమోట్ చేస్తున్నారన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అక్షయ్ నటించే సినిమాలు జాతీయవాదంతో కూడినవై ఉంటాయని, ఇది కొన్నిసార్లు బీజేపీకి అనుకూలంగా ఉంటోందనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన టైమ్స్ నౌతో మాట్లాడుతూ… ఇలా ప్రచారం జరుగుతోన్న మాట వాస్తవమేనని, ఏక్ ప్రేమ్ కథా చిత్రం ద్వారా స్వచ్ఛభారత్‌ను ప్రోత్సహిస్తున్నానని, కానీ కాంగ్రెస్ హయాంలో జరిగిన వాస్తవాలను కూడా సినిమాల రూపంలో తీసుకు వచ్చినట్లు చెప్పారు.
తాను కాంగ్రెస్ హయాంలో జరిగిన మిషన్ రాణిగంజ్, ఎయిర్ లిఫ్ట్ వంటి సినిమాలను కూడా తీసిన విషయం మరిచిపోతున్నారన్నారు. ఈ అంశాలు కాంగ్రెస్ హయాంలో జరిగాయని, అక్షయ్ కుమార్ సినిమాలుగా మలిచారని చెప్పడం లేదన్నారు. కొంతమంది తమకు అనుగుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, ప్రధాని నరేంద్రమోదీతో ఆయన చేసిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో పాటు కొంతమంది వేలెత్తి చూపడానికి కారణమైంది. దీనిపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ… ఏ పార్టీ అనే అంశం కాదని, ప్రధానమంత్రితో ఇంటర్వ్యూ అంటే ఎవరు చేయకుండా ఉంటారని, ప్రతి ఒక్కరు చేస్తారని, తనకు అవకాశం వచ్చింది కాబట్టి చేశానని కుండబద్దలు కొట్టారు. తాను ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేశానని, మరెవరినో కాదన్నారు…